తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త శకం ప్రారంభం కానుంది.. మరో మూడు రోజుల్లో పార్టీని ప్రకటించనున్నారు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూతురు వైఎస్ షర్మిల… ఇప్పటికే పొలిటికల్ పార్టీ పెట్టడం ఖాయమని స్పష్టం చేసిన ఆమె.. దానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా పూర్తి చేసుకున్నారు.. షర్మిల ఏర్పాటు చేయనున్న పార్టీ పేరు.. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా రిజిస్ట్రర్ చేయించారు.. ఇక, తాజాగా పార్టీ జెండా కూడా రెడీ అయిపోయింది..
జెండాను తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట రంగుతో రూపొందించింది షర్మిల టీమ్.. జెండాలో 70 శాతం పాలపిట్ట రంగు ఉండగా.. మిగిలిన 30 శాతం నీలం రంగు ఉంది.. పాలపిట్ట రంగు మధ్యలో తెలంగాణ మ్యాప్.. ఆ మ్యాప్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి బొమ్మను పొందుపరుస్తూ జెండాను తయారు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజైన ఈ నెల 8వ తేదీన.. హైదరాబాద్‌లోని జేఆర్సీ సెంటర్‌లో పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.. సభా వేదికగా జెండా, అజెండా, పార్టీ పేరును అధికారికంగా ప్రకటించనున్నారు వైఎస్ షర్మిల… మరోవైపు.. తన పార్టీకి వ్యూహకర్తగా.. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ శిష్యురాలు ప్రియను నియమించుకున్నారంటూ ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపనలే లక్ష్యం అంటూ అడుగులు వేస్తున్నారు వైఎస్ షర్మిల.