తెలంగాణలో ఇంకా కుదురుకోలేదు. పాదయాత్ర పేరుతో ఖమ్మం జిల్లాను చుట్టేస్తున్నారు వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల. తాజాగా ఆమె ఎక్కడినించి పోటీచేస్తానో క్లారిటీ ఇచ్చేశారు. పాలేరు పై షర్మిల కన్ను వెనుక వ్యూహం ఏంటని అంతా చర్చించుకుంటున్నారు. పాలేరు కాంగ్రెస్ కు పెట్టని కోట. అక్కడ కాంగ్రెస్ కు ఎప్పుడూ గెలుపు నల్లేరు మీద బండి నడకే. కాంగ్రెస్ గెలుపు షర్మిలకు కలసి రానుందంటున్నారు. టీఆర్ఎస్ వర్గ పోరు షర్మిలకు కలసి రానుందనేది మరో వర్గం విశ్లేషణ. మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీకి ఖమ్మంలో కాసింత ఎదురుగాలి వీస్తోంది.
వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధినేత షర్మిల పాలేరు నుంచి పోటీ చేయాలని అనుకోవడం వెనుక ఏం జరుగుతుంది? అక్కడ నుంచే ఎందుకు పోటీ చేయాలని ఆమె భావిస్తోంది. పాలేరు మొదటి నుంచీ కాంగ్రెస్ కు కంచుకోట కావడమేనా? అందువల్లనే అక్కడ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుందా? టీఆర్ఎస్ లోని వర్గ పోరు తనకు ఉపయోగపడుతుందని ఆమె భావిస్తోందా? క్యాడర్ అంతగా లేని ఆ పార్టీ పాలేరులో ఎలా నెగ్గుకుని వస్తుందనేది చర్చనీయాంశంగా మారింది.
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం అటు నల్లగొండ, ఇటు వరంగల్ జిల్లాలకు సరిహద్దుగా ఉంటుంది. అక్కడ కుల పరంగా రెడ్డిలు తక్కువగానే ఉన్పప్పటికి మొదటి నుంచి అక్కడ రాజకీయ అధికారం రెడ్డి వర్గం చేతిలోనే ఉంటుంది. ఆనాడు భువన సుందర్ రెడ్డి అనే ఓ బడా భూస్వామి సమితి ప్రెసిడెంట్ గా, జిల్లా పరిషత్ చైర్మన్ గా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడుగా పని చేశారు. పాలేరు జనరల్ గా మారిన తరువాత రామిరెడ్డి వెంకటరెడ్డి రెండు సార్లు ఎంఎల్ఎగా ఎన్నికయ్యారు. ఇక్కడ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత సంభాని చంద్ర శేఖర్ మూడు సార్లు ఎంఎల్ఎ గా ఎన్నిక అయి మంత్రి అయ్యారు.
రామిరెడ్డి వెంకటరెడ్డి, సంభాని చంద్ర శేఖర్ లు మంత్రులుగా పని చేసిన చరిత్ర ఉంది. వారిద్దరు కాంగ్రెస్ నుంచి ఎన్నిక అయిన వారే. పాలేరు నియోజకవర్గం ఏర్పడ్డ నాటి నుంచి అక్కడ కాంగ్రెస్ పార్టీ అవలీలగా గెలుపొందుతోంది. అందువల్లనే ఇప్పుడు షర్మిల కూడా పాలేరు నియోజకవర్గాన్ని ఎంచుకుందని అంటున్నారు. దీనికి తోడుగా పాలేరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ లో రెండు వర్గాలు బాహా బాహీకి దిగుతున్నాయి. అటు ఎంఎల్ఎ కందాల ఉపేందర్ రెడ్డి వర్గం, అదే విధంగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గాలు కూడా టీఆర్ఎస్ లో పోటీ పడుతున్నాయి. దీంతో ఇక్కడ షర్మిల పార్టీ వైపు మిగిలిన వర్గాలు అనుకూలంగా పని చేస్తారని ఆ పార్టీ నమ్ముతుందని అంటున్నారు.
1972లో పాలేరు నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎనిమిది సార్లు ఇక్కడి నుంచి కాంగ్రెస్ గెలుపొందింది. మరో మూడు సార్లు వామపక్షాలు గెలుపొందాయి. 2016 ఉప ఎన్నికల్లో మాత్రమే అధికారం మొత్తం ఉపయోగించుకుంటేనే ఆనాడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంత్రి హోదాలో ఇక్కడ నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ కు బలమైన పునాది ఉందని స్పష్టం అవుతుంది. ఇక్కడ శ్రేణుల్లో కాంగ్రెస్ నరా నరాన జీర్జించుకుని పోయిందని అంటారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎస్సీ, ఎస్టీ వర్గాలు కాంగ్రెస్ తో పెనవేసుకుని పోయి ఉన్నారు.
కానీ, పాలేరు నియోజకవర్గంలోకాంగ్రెస్ కు బలమైన నాయకత్వం లేకుండా పోయింది. ఇక్కడ కాంగ్రెస్ కు అసలు నాయకులే లేరు. కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్న ప్రస్తుత నేతలు ఎవ్వరు కూడా అటు తుమ్మల నాగేశ్వరరావు, ఇటు కందాల ఉపేందర్ రెడ్డిని ఢీ కొనే స్థాయి ఉన్న నేతలు కాదు. అందువల్లనే ఇక్కడ కాంగ్రెస్ నాయకులు మరో నాయకుడి కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఈనేపథ్యంలో కాంగ్రెస్ క్యాడర్ అంతా షర్మిల వైపు చూస్తారన్న నమ్మకం బలంగా వుంది. టీఆర్ఎస్ లో ఉన్న వర్గ విభేదాలు కూడా షర్మిలకు కలసి వస్తాయన్న నమ్మకం ఆ పార్టీలో ఉండి ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు వైఎస్ ఆర్టీపీ పార్టీకి ఇక్కడ మాత్రం అసలు నాయకత్వమే లేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో నాయకత్వాన్ని పటిష్ట పరచుకోకుండా పోటీలో దిగడం మాత్రం ఆపార్టీకి ఉన్న ధైర్యం ఏంటో అర్థం కాని పరిస్థితి. షర్మిల పాలేరు పాలసీ వెనుక ఏం వ్యూహం వుందో రాబోయే రోజుల్లో అర్థం అవుతుంది.
(ఖమ్మం ప్రతినిధి భూపాల్ సౌజన్యంతో…)
Anand Mahindra: అగ్నివీరులకు ఆనంద్ మహీంద్రా బంపర్ ఆఫర్..