హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్‌కు లేఖరాశారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల… హుజురాబాద్ ఉప ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్‌ను తొలగించాలి, స్థానిక పోలీస్ కమిషన్‌పై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో నిరుద్యోగులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇతర వర్గాల వారు నామినేషన్లు వేయకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని.. నామినేషన్లకు దరఖాస్తులు కూడా ఇవ్వడం లేదని.. అభ్యర్థి మద్దతుదారులను స్థానిక మండలాల పోలీసులతో బెదరించి, వెనక్కి పంపిస్తున్నారంటూ ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.
ఇదేంటని ప్రశ్నించిన వారిని పోలీసులు తమ అదుపులోకి తీసుకుని కేసులు బనాయిస్తున్నారని ఆరోపించిన వైఎస్ షర్మిల.. ఏ విషయం అయినా మౌఖికంగా చెబుతున్నారు.. కానీ, పేపరు రూపంలో ఇవ్వడం లేదు. అభ్యర్థులను, మద్దతుదారులను కోవిడ్ నిబంధనల పేరుతో భయబ్రాంతులకు గురిచేస్తున్నారు.. కోవిడ్ నిబంధనలు పాటించినా.. ఏదో ఒక కారణంతో పోలీసులు వెనక్కి పంపిస్తున్నారని ఎస్‌ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి చేసుకుంటేనే నామినేషన్లకు అర్హులని చెబుతున్నారు.. మరీ.. రెండు డోసుల మధ్య ఉన్న సమయంతో.. నామినేషన్లు వేసే అవకాశం కూడా ఉండదు కదా? అని ప్రశ్నించారు. రెండు డోసులు వేశాకే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.. రాజ్యాంగబద్ధంగా నామినేషన్లు వేసే స్వేచ్ఛను కూడా కల్పించడం లేదని.. తక్షణమే హుజురాబాద్ ఉప ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ రవీందర్‌రెడ్డిని విధుల నుంచి తొలగించాలి.. కరీంనగర్ పోలీసు కమిషనర్ సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.