వరంగల్ లో కాంగ్రెస్ పార్టీ చేసిన రైతు డిక్లరేషన్ పైనా వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి రైతుల సంక్షేమం పట్ల చిత్తశుద్ది లేదన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్ అని వాళ్ల పార్టీ వాళ్లే అంటున్నారని అన్నారు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ దొంగని పార్టీ చీఫ్ గా పెడితే ప్రజలు నమ్మరని షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు.
వరంగల్ సభలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ముందు అమలు చేయాలన్నారు. అప్పుడే తెలంగాణ రైతులకు కాంగ్రెస్ పార్టీ పట్ల నమ్మకం కల్గుతుందన్నారు. టీఆర్ఎస్ పార్టీతో పొత్తు ఉండదని రాహుల్ గాంధీ చెప్పుకునే స్థాయికి కాంగ్రెస్ పరిస్థితి వచ్చిందన్నారు. ప్రజలంతా ఆ రెండు పార్టీలు కలిసిపోతాయని భావిస్తుండటం వల్లే రాహుల్ గాంధీ ఈ ప్రకటన చేశారన్నారు. కాంగ్రెస్- టీఆర్ఎస్ రాజకీయాలను తెలంగాణ ప్రజలంతా గమనిస్తున్నారని షర్మిల అన్నారు.
అనంతరం ఆమె సీఎం కేసీఆర్ పై విరుచుకు పడ్డారు. సీఎం మాటలు విని వరి సాగు చేయక కొందరు నష్టపోతే… పంట వేసిన వాళ్లు కొనేవారు లేక ఇబ్బందులు పడుతున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమం అని చెప్పుకునే కేసీఆర్.. గిట్టుబాటు ధర ఎందుకు కల్పించడం లేదని షర్మిల నిలదీశారు. ధనిక రాష్ట్రమని గొప్పలు చెప్పుకునే కేసీఆర్.. రైతులకు బోనస్ ఇవ్వలేరా ఇని ప్రశ్నించారు.
ఇప్పటికైనా కేసీఆర్ ఫామ్ హౌజ్ నుంచి బయటికి వచ్చి రైతుల సమస్యలు తెలుసుకోవాలన్నారు. తమతో పాటు వస్తే అన్నదాతల కష్టాలు చూపిస్తామన్నారు షర్మిల. కేసీఆర్ మత్తు వీడితేనే రైతుల కష్టాలు తీరుతాయన్నారు.