హైదరాబాద్ నార్నింగీలో కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఓ దుండగుడు ఒక చిన్నారి నోరు మూసి, ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే.. అటు వెళ్తున్న ఓ మహిళకు అనుమానం కలగడంతో అడ్డుకుంది. ఎందుకు చిన్నారి నోరు మూశావని గట్టిగా అరుస్తూ నిలదీసింది. దీంతో గాబరాపడ్డ ఆ కిడ్నాపర్.. మహిళని తోసేసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఇంతలోనే స్థానికులు అతడ్ని పట్టుకున్నారు. చెట్టుకు కట్టేసి చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. కిడ్నాపర్‌ను స్టేషన్‌కు తీసుకెళ్లారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. కిడ్నాపర్ వద్ద కత్తి ఉందని, గట్టిగా అరిస్టే చంపేస్తానంటూ బెదిరించాడని పోలీసులకు స్థానికులు తెలిపారు.
కాగా.. ఈమధ్య కిడ్నాప్ వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. రెండు వారాల క్రితమే.. మహబూబ్‌నగర్‌లో 13 నెలల చిన్నారి కిడ్నాప్‌కు గురి కావడం తీవ్ర సంచలనం రేపింది. జులై 1వ తేదీన గుర్తు తెలియని వ్యక్తులు ఆ పాపని కిడ్నాప్ చేశారు. ఈ కేసుని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్‌లో ఆటోకి సంబంధించిన క్లూ ఆధారంతో ఛేదించారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి, దుండగుల్ని అరెస్ట్ చేసి, పాపని సేఫ్‌గా కాపాడగలిగారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఒంటరిగా బయటకు పంపొద్దని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.