Yadagirigutta : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి వచ్చే భక్తుల కోసం ఆధ్యాత్మిక అనుభూతిని మరింత పెంపొందించేలా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఐదు కొత్త ఆర్జిత సేవలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సేవలు వైకుంఠ ఏకాదశి నుంచే కాకుండా ఫిబ్రవరి మాసం నుంచి దశలవారీగా భక్తులకు అందుబాటులోకి రానున్నాయి.
ఈ కొత్త సేవల్లో భాగంగా ముందుగా తోమాల సేవను ప్రవేశపెట్టనున్నారు. ఈ సేవ ప్రతి బుధవారం ఉదయం 6:15 గంటల నుంచి 6:45 గంటల వరకు నిర్వహించబడుతుంది. దంపతులు కలిసి పాల్గొనే ఈ సేవకు టికెట్ ధరను ₹500గా నిర్ణయించారు. భక్తులు స్వామివారికి తోమాల సమర్పించి ప్రత్యేక ఆశీర్వాదాలు పొందే అవకాశం ఉంటుంది.
Sonam Yeshey T20 Record: టీ20 క్రికెట్‌లో నయా చరిత్ర.. 8 వికెట్స్ పడగొట్టిన బౌలర్!
అలాగే ఇప్పటివరకు ఉన్న పద్ధతికి భిన్నంగా తులాభారం సేవను సరికొత్తగా రూపొందించారు. ఈ సేవలో భక్తులు తీసుకురావాల్సిన నాణేలు, బెల్లం వంటి వస్తువులను ఆలయ అధికారులు స్వయంగా అందుబాటులో ఉంచనున్నారు. దీంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తులాభారం నిర్వహించే అవకాశం కలగనుంది.
వైకుంఠ ఏకాదశి తర్వాత ప్రతిరోజూ సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవను నిర్వహించనున్నారు. ఈ సేవకు టికెట్ ధర ₹500గా నిర్ణయించగా, ఇందులో పాల్గొన్న భక్తులకు రెండు లడ్డూలను ఉచితంగా అందజేయనున్నారు. ఆలయం అంతటా వెలిగే దీపాలతో భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణం మరింత ఉత్సాహాన్ని కలిగించనుంది.
ఇక ఇప్పటివరకు రథసప్తమి రోజుకే పరిమితమైన సూర్యప్రభ వాహన సేవను ఇకపై ప్రతి ఆదివారం ఉదయం 7:00 గంటల నుంచి 7:30 గంటల వరకు నిర్వహించనున్నారు. దంపతుల కోసం ఈ సేవ టికెట్ ధర ₹1,000గా నిర్ణయించారు. ఈ సేవలో పాల్గొనే భక్తులకు ఒక శాలువా , కనుమను ప్రసాదంగా అందజేస్తారు.
అలాగే ఆలయ చరిత్రలో తొలిసారిగా చంద్రప్రభ వాహన సేవను కూడా ప్రారంభించనున్నారు. ఈ సేవకు కూడా టికెట్ ధర ₹1,000గా నిర్ణయించగా, భక్తులకు ప్రత్యేక వాహన సేవ ద్వారా స్వామివారి దర్శనం లభించనుంది.
ప్రారంభ తేదీల విషయానికి వస్తే, వైకుంఠ ఏకాదశి నుంచే తోమాల సేవ, తులాభారం సేవ, సహస్ర దీపాలంకరణ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇక ఫిబ్రవరి 1వ తేదీ, అంటే మాఘశుద్ధ పౌర్ణమి నుంచి సూర్యప్రభ , చంద్రప్రభ వాహన సేవలను ప్రారంభించనున్నారు.
యాదగిరిగుట్టను ఆధ్యాత్మికంగా మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో అధికారులు తీసుకుంటున్న ఈ చర్యల పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్త సేవలతో స్వామివారి దర్శనం మరింత ప్రత్యేకంగా మారుతుందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
AP Cabinet: పోలవరం లేనిచోట పోలవరం జిల్లా ఏంటి?.. సీఎం చంద్రబాబుకు మంత్రి ప్రశ్న!