మిస్ వరల్డ్ పోటీదారులు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని, పోచంపల్లి చేనేత పరిశ్రమను సందర్శించారు. స్థానిక ప్రజలు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇకత్ చీరలను పరిచయం చేశారు. అంతేకాకుండా తయారీ విధానాన్ని కూడా పరిశీలించి.. అనంతరం స్వయంగా చీరలను నేసి సంతోషపడ్డారు.
సాంస్కృతిక వారసత్వం. ఇక్కత్ చీరల నేతకు ప్రపంచ ప్రసిద్ధి చెందింది. అలాంటి భూదాన్ పోచంపల్లి గ్రామ చేనేత పార్క్‌ను ఈసారి అంతర్జాతీయ సుందరీమణుల మన్ననలు పొందింది. ఆఫ్రికా ఖండం నుంచి వచ్చిన 25 దేశాల మిస్ వరల్డ్ పోటీదారులు ఈ గ్రామాన్ని సందర్శించి.. స్థానిక సంస్కృతి, కళలు, మ్యూజిక్‌తో మమేకమయ్యారు. సిందూరం, సంగీతం, చేతి నేతల మధ్య కళాత్మకమైన ఈ సందర్శనం అతిథుల హృదయాలను రంజింపజేసింది.
గ్రామ చేనేత పార్క్ ప్రవేశద్వారం దగ్గరే స్థానికులు సంప్రదాయ దుస్తుల్లో అందాల భామలకు స్వాగతం పలికారు. సిందూరం నుదుట దిద్ది.. పువ్వుల మాలలు అందించారు. పోచంపల్లికి హృదయపూర్వక స్వాగతం అంటూ అందగత్తెలకు హృదయాలను హత్తుకునేలా ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్క్ మ్యూజియంలోని స్టాల్‌లను సందర్శించారు.
ఇది కూడా చదవండి: Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం.. షాకిచ్చిన నూజివీడు కోర్టు..
ప్రత్యేకమైన ఇక్కత్ చీరల తయారీ విధానాన్ని స్థానిక పార్కులో పరిశీలించిన అతిథులు.. నూలు వడకడం నుంచి రంగులు చొప్పించే క్లిష్టమైన ప్రక్రియలను చూసి ఆశ్చర్యచకితులయ్యారు. ఒక్క చీరకు వారాలు తీసుకునే శ్రమ, డిజైన్ల సృజనాత్మకత కంటెస్టెంట్ల మనసును హత్తుకుంది. చీరలపై భిన్న డిజైన్లను గమనించిన అతిథులు, కొందరు స్వయంగా రాట్నంతో నూలు వడికే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం హనుమంత రావు, భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి, రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
అలాగే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి కరేబియన్ దేశాలకు చెందిన 9 మంది సుందరీమణులు వచ్చారు. ఆలయ గెస్ట్ హౌస్ దగ్గర అధికారులు ఘన స్వాగతం పలికారు. గెస్ట్ హౌస్ నుంచి బ్యాటరీ వాహనాల్లో ఆలయ మాడ వీధుల్లో విహరించారు.
ఇది కూడా చదవండి: Ambati Rambabu: నిబంధనలు అతిక్రమించిన ఏ ఒక్క పోలీసును వదలం..!