వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పంచి పెళ్ళికూడా చేసుకున్నారు. 6నెలలు సజావుగా సాగుతున్న జీవితంలో వరకట్నం వేధింపులు ఆయువతికి తోడయ్యాయి. తరచూ వేధింపులు తాళలేక ఇటు పుట్టింటిలో ఈవిషయం చెప్పలేక. చివరకు ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ లో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన గుంజె పిచ్చయ్య కూతురు రమాదేవి (21), ఇదే మండలం తుమ్మలపెనపహాడ్ గ్రామానికి చెందిన వరికుప్పల విజయ్ ప్రేమించుకున్నారు.
పెద్దలను ఒప్పించి 6 నెలల క్రితం వివాహం చేసుకున్నారు. వివాహ సమయంలో కట్నంగా నగదుతో పాటు ప్లాటు, మండల కేంద్రంలో వ్యవసాయ భూమిని ఒప్పుకున్నారు. విజయ్ వృత్తి రీత్యా డ్రైవర్ కావడంతో సూర్యాపేటలో కాపురం పెట్టారు. కాగా, కొద్ది రోజులుగా అదనపు కట్నం తేవాలని భర్త అత్త మామలు రమాదేవిని వేధిస్తున్నారు. భర్త విజయ్ తరచూ చిత్రహింసలు గురి చేస్తుండడంతో రమాదేవి మనస్తాపానికి గురైంది.
ఈ నేపథ్యంలోనే ఈ నెల 14న రాత్రి గుర్తుతెలియని టాబ్లెట్స్ మింగింది. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున రమాదేవి మృతిచెందింది. మృతురాలి తండ్రి గుంజె పిచ్చయ్య ఫిర్యాదు మేరకు భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ యాదవేందర్‌రెడ్డి తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Floods: ఉగ్రరూపం దాల్చిన నదులు.. వరదల్లో 55 మంది మృతి