హైదరాబాద్‌లో వింగ్స్ ఇండియా ఏవీయేషన్ షో (Wings India Aviation Show) అట్టర్ ఫ్లాప్ అయ్యింది. వివిధ సంస్థల ఉత్పత్తుల ప్రదర్శన దగ్గర నుంచి ఏర్పాట్లు వరకూ అన్ని ఫెయిలయ్యాయి. దీంతో ఈ ప్రదర్శనకు విచ్చేసిన సందర్శకులు పెద విరుస్తున్నారు.
అంతర్జాతీయ స్థాయి వింగ్స్ ఇండియా 2022కు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం వేదికయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా విమానయాన రంగంలో గల అనేక సంస్థలు తమ ఉత్పత్తుల్ని ఇక్కడ ప్రదర్శించాయి. దేశ, విదేశాలకు చెందిన విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు కొలువుదీరాయి. ఆంబ్రియర్ సంస్థకు చెందిన అతి పెద్ద విమానం E195-E2 కూడా సందర్శకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. కొత్త తరం ఈ-జెట్స్ కుటుంబానికి చెందిన విమానాల్లోనే E195-E2 అతి పెద్దది. ఇందులో 146 మంది ప్రయాణించే వీలుంటుంది. ముఖ్యంగా మన దేశంలోని చిన్న నగరాల్లో గల టూ టైర్, త్రీటైర్ విమానాశ్రయాలకు ఈ-జెట్స్ చాలా అనుకూలంగా ఉంటాయంటున్నారు.
ఏవియేషన్ షో భారీ విమానం ఎయిర్ బస్-350 ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హెలికాప్టర్లు, డ్రోన్ల విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. ఇంత వరకూ బాగానే ఉన్నా… షోకు విచ్చేసిన సందర్శకులు పూర్తి స్థాయిలో సంతృప్తిపర్చలేకపోయింది. ఏవియేషన్ షో టికెట్ ధర 600 రూపాయలు. ఈ ఖర్చు పెట్టి వస్తున్న సందర్శకులు… చాలా ఉత్పత్తుల్ని చాలా దూరం చూడాల్సి వస్తోంది. బారికేడ్లను దాటి వెళ్లనివ్వడం లేదు నిర్వాహకులు. అంతే కాదు… ఆయా విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్ల విశేషాల గురించి వివరించే నాథుడే లేడు. ఈ ఏవియేషన్‌లో దాదాపు 200 సంస్థలకు చెందిన ఉత్పత్తులు కొలువుదీరుతాయని నిర్వాహకులు చెప్పినా… ఆ స్థాయిలో ప్రదర్శన కనిపించడం లేదు. ఈ సారి పెద్దగా ప్రెజంటేషన్లు ఇవ్వలేదు… కాన్ఫరెన్స్‌లు కూడా అంతగా జరగలేదు. ఫలితంగా చెప్పుకో దగ్గ స్థాయిలో MOUలు కుదర్లేదు.
ఏవియేషన్ షోను చూసేందుకు వస్తున్న సందర్శకులకు కనీసం మంచినీరు కూడా ఏర్పాటు చేయలేదు నిర్వాహకులు. 30 రూపాయలు పెట్టి మంచినీటి బాటిల్ కొనుక్కోవాల్సిందే. అలాగే, ఆహార పదార్థాల ధరలు కూడా అధికంగా ఉన్నాయని సందర్శకులు అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పిల్లాపాపలతో వచ్చిన వాళ్లు ఇబ్బందిపడ్డారు. ఈ ఎగ్జిబిషన్లో సందర్శకులకు కనీసం నిలువ నీడ కూడా లేకపోవడంతో… వేసవి తాపానికి అల్లాడిపోయారు. మొత్తానికి అంతర్జాతీయ స్థాయి ఏవియేషన్ షో ఏర్పాట్లు చేయడంలో నిర్వాహకులు ఘోరంగా విఫలమయ్యారు.