wine shops closed in hyderabad:హైదరాబాద్ నగరంలో ఆదివారం నాడు బోనాల పండగ అంగరంగ వైభవంగా జరగనుంది. బోనాల పండుగ సందర్భంగా ఆదివారం, సోమవారం (జూలై 24, 25) రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. తిరిగి మళ్లీ మంగళవారం తెరుచుకోనున్నాయి. బోనాల పండుగ నేపథ్యంలో దుకాణాలు మూసి వేయాలని హైదరాబాద్ సిటీ కమిషనర్ సీవీ ఆనంద్ సర్క్యులర్ జారీ చేశారు. ఈ మేరకు రెండు రోజుల పాటు షాపులు మూసివేస్తున్నట్లు అన్ని వైన్స్ షాపుల ముందు యజమానులు బోర్డులు ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. దీంతో నగరంలోని మద్యం దుకాణాల ముందు శనివారం సాయంత్రం నుంచి మందుబాబులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు.
Read Also: Minister KTR: నా కాలికి గాయమైంది.. మంచి ఓటీటీ షోలు ఉంటే చెప్పండి
అయితే హైదరాబాద్ ఈస్ట్, వెస్ట్ జోన్‌లో మాత్రం ఆదివారం ఒక్కరోజు మాత్రమే మద్యం దుకాణాలు మూత పడనున్నాయి. సౌత్ జోన్‌లో మాత్రం రెండు రోజుల పాటు వైన్షాపులను మూసివేయనున్నారు. వైన్స్‌తోపాటు బార్లు, క్లబ్బులను మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాగా మద్యం దుకాణాలు బంద్ కేవలం హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో మాత్రమే ఉంటుందని.. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో మద్యం దుకాణాలు తెరిచి ఉంటాయని తెలుస్తోంది.
మరోవైపు బోనాల పండగ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఆది, సోమవారాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. తెలుగు తల్లి ఫ్లై ఓవర్ మీదుగా వెళ్లే వాహనాలను తెలుగు తల్లి జంక్షన్ మీదుగా మళ్లిస్తామని వెల్లడించారు.