హైదరాబాద్ ఓల్డ్ సిటీకే పరిమితం అని భావించే ఎంఐఎం పార్టీ.. క్రమంగా రాష్ట్రాల విస్తరణపై దృష్టి సారించింది.. హైదరాబాద్ నుంచి తెలంగాణలోని పలు ప్రాంతాలపై కేంద్రీకరించిన ఆ పార్టీ.. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ఏరియాల్లో కూడా ప్రభావం చూపింది.. ఇక, మహారాష్ట్ర, బీహార్‌లో పలు సీట్లు గెలిచి ఖాతా చేరిన ఆ పార్టీ.. తాజాగా పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మధ్య ప్రదేశ్, తమినాడు, కర్ణాటక.. ఇలా దేశవ్యాప్తంగా విస్తరించేందుకు పూనుకుంది.. జైపూర్ పర్యటనలో ఉన్న ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇవాళ మీడియాతో మాట్లాడారు.. తమ పార్టీని జాతీయ స్థాయిలో మరింతగా విస్తరించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.. మరో నెల రోజుల్లో రాజస్థాన్‌లో తమ పార్టీని ప్రారంభిస్తామని ప్రకటించారు.. రాజస్థాన్‌లో పార్టీని ప్రారంభిస్తున్నాం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తాం అని వెల్లడించారు అసదుద్దీన్ ఒవైసీ.. కాగా, విపక్షాల ఓటు బ్యాంకును దెబ్బకొట్టి.. బీజేపీని గట్టు ఎక్కించడానికే ఎంఐఎం అన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తుందనే ఆరోపణలు లేకపోలేదు.