రోజుకో తరహాలో మోసాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి… తాజాగా వరంగల్‌లో వెలుగుచూసిన ఘటన విస్మయానికి గురిచూస్తోంది.. ఏకంగా న్యాయస్థానాన్నే బురిడీ కొట్టించే ప్రయత్నం చేశారు.. కానీ, వరంగల్ పోలీసు వారి ఆటలను సాగనివ్వలేదు.. అరెస్ట్ చేసిన కటకటాల వెనక్కి నెట్టారు.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వివిధ కేసుల్లో నిందితులుగా వున్న సమయంలో వారికి కోర్టు బెయిల్ ఇచ్చేందుకు కావల్సిన వత్రాలు, పూచికత్తు సంతకాలను ఫోర్జరీ చేసి ధ్రువీకరణ పత్రాలను సృష్టిస్తున్న ఐదుగురు సభ్యుల గ్యాంగ్ పోలీసులకు చిక్కింది.. దొంగ బెయిల్ పత్రాలను సృష్టిస్తున్న వీరిని వరంగల్ టాస్క్ ఫోర్స్ మరియు సుబేదారి పోలీసులు అరెస్ట్ చేసారు. వీరి నుండి పోలీసులు వంచాయితీరాజ్ విభాగానికి చెందిన రబ్బర్ స్టాంప్స్ తో పాటు వంచాయితీ కార్యదర్శి రబ్బర్ స్టాంపులు మరియు నకిలీ ఇంటి విలువ ధ్రువీకరణ పత్రాలు, ఇంటి పన్ను రశీదులు, వివిధ వ్యక్తులకు సంబంధించిన అధార్ కార్డులు, పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో పాటు మూడు సెల్‌ఫోన్లు, మూడు వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
నిందితుల్లో ఒకరు రాజశేఖర్ అలియాస్ రాజేష్.. నగరంలో ఒక లాయర్ వద్ద గుమాస్తాగా విధులు నిర్వహిస్తుండేవాడు. తన లాయర్ వద్దకు వివిధ కేసుల్లో నిందితులుగా వున్న వ్యక్తులకు కోర్టు బెయిల్ ఇచ్చేందుకు గాను అవసరమైన పత్రాలు, పూచికత్తు సంతాకాలను సులభంగా సృష్టించేందుగాను నిందితుడు రాజశేఖర్ మిగితా నిందితులను సంప్రదించేవాడు. దీనితో మిగితా నిందితులు వరంగల్, హన్మకొండ జిల్లాల్లోని వివిధ గ్రామాలకు సంబంధించిన పంచాయితీ రాజ్ విభాగాని చెందిన రౌండ్ రబ్బర్ స్టాంపులు, గ్రామ పంచాయితీ కార్యదర్శి పేరు మీదగా హైదరాబాద్‌లో తయారు చేయించిన రబ్బర్ స్టాంపులను వినియోగించుకోని బెయిల్ కోసం పూచీకత్తు ఇస్తున్న వ్యక్తుల పేర్ల మీద గ్రామ పంచాయితీ కార్యదర్శి జారీ చేసిన రీతిలో ధృవీకరణ పత్రం, ఇంటి విలువ, ఇంటి పన్నుకు సంబంధించిన ఫోర్జరీ పత్రాలను సృష్టించి అందజేసేవాడు. నిందితులు బెయిల్ పత్రాలను కోర్టుకు అందజేసే సమయంలో ఫోర్జరీ పత్రాలతో పాటు పూచీకత్తు ఇస్తున్న వ్యక్తుల ఆధార్‌కార్డులతో పాటు సదరు పూచీకత్తు ఇస్తున్న వ్యక్తులు న్యాయమూర్తి ముందు హజరయ్యేవారు. ఈ రోజు ఉదయం టాస్క్ ఫోర్స్ పోలీసులు, స్థానిక సుబేదారి పోలీసుల కలిసి సుబేదారి ప్రాంతంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా నిందితుడు రవీందర్ వాహనాన్ని అపి పోలీసులు తనిఖీ చేయగా అతని వద్ద అనధికారికంగా గ్రామ పంచాయితీ కార్యదర్శి, పంచాయితీ రాజ్ విభాగానికి సంబంధించి రౌండ్ షీల్డ్ రబ్బర్ స్టాంపులతో పాటు, ఇంటి విలువ, ఇంటి పన్ను రశీదులు దొరకడంతో.. నిందితుడిని అదుపులోకి తీసుకోని తమదైన రీతిలో ప్రశ్నించారు.. దీంతో నిందితుడు పాల్పడుతున్న నేరాలను అంగీకరించడంతో పాటు నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు మిగితా నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు.. ఇలా తీగ లాగితే డొంక అంతా కదిలింది.