వరంగల్ మామునూర్ ఎయిర్‌పోర్టు ప్రాంగణం దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కార్యకర్తల మద్య తోపులాట జరిగింది. మామునూరు ఎయిర్ పోర్ట్‌కు ఆమోదం రావడంతో కాంగ్రెస్, బీజేపీ ఆధ్వర్యంలో వేరువేరుగా సంబరాలు చేసుకుంటున్నారు. ఒకే సమయంలో ఎయిర్ పోర్ట్ ప్రధాన గేటు వద్దకు కాంగ్రెస్, బీజేపీ నేతలు.. కార్యకర్తలు చేరుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు భారీగా వచ్చారు. దీంతో.. ఇరు పార్టీల నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. కాగా.. కార్యకర్తలు, నాయకుల మధ్య తోపులాట, ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని శాంతింప చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు.. బీజేపీ నేతలు ప్రధాని మోడీకి పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు. అటు.. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి అదే చోట పాలాభిషేకం చేసేందుకు కాంగ్రెస్ నేతలు యత్నించారు. దీంతో.. రెండు వర్గాల మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది.
Read Also: Sankranthiki Vasthunnam: నేటి నుండి ఓటీటీలో సందడి చేయనున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’
కాగా.. మామునూరులో కొత్త విమానాశ్రయం నిర్మాణానికి కీలక ముందడుగు పడిన సంగతి తెలిసిందే.. ఎయిర్‌పోర్ట్ అభివృద్ధిపై గత కొంతకాలంగా కొనసాగుతున్న కసరత్తులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మామునూరును విమానాశ్రయంగా అభివృద్ధి చేయాలని గతంలోనే ప్రతిపాదనలు పంపగా, తాజాగా కేంద్రం దీనికి అంగీకారం తెలిపింది. ఈ నిర్ణయంతో వరంగల్ ప్రాంతానికి ప్రయాణ సౌకర్యాలు మరింత పెరగనున్నాయి. విమాన ప్రయాణాల విస్తరణ, వ్యాపారం, పర్యాటకం అభివృద్ధికి మామునూరు ఎయిర్‌పోర్ట్ కీలకంగా మారనుంది. కేంద్రం అనుమతినిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని పనులను వేగంగా ప్రారంభించనున్నట్లు సమాచారం.