Brothers Victory: కాంగ్రెస్ తెలంగాణలో విజయదుందుభి మోగించింది. 119 అసెంబ్లీల్లో 65 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించబోతోంది. అధికార బీఆర్ఎస్ పార్టీ హస్తం ధాటికి నిలబడలేకుండా పోయింది. తెలంగాణ ఇచ్చామన్న ట్యాగ్ ఉన్నప్పటికీ అధికారానికి తొమ్మిదిన్నర ఏళ్లు దూరంగా ఉండటం, కాంగ్రెస్‌లో గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి ఎమ్మెల్యేలు వెళ్లడం, క్యాడర్, లీడర్లు చేజారిపోవడం జరిగింది. అయినా కూడా కాంగ్రెస్ తాజా ఎన్నికల్లో ఉవ్వెత్తున ఎగిసిపడింది.
Read Also: Ashok Gehlot: గెహ్లాట్ “మ్యాజిక్ ముగిసింది”.. బీజేపీ సెటైర్లు..
ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీలో ఉన్న బద్రర్స్ మాత్రం గెలిచారు. మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్, బెల్లంపల్లి నుంచి దివంగత కాంగ్రెస్ నేత వెంటకస్వామి కుమారులు గడ్డం వినోద్, వివేక్ గెలుపొందారు. బెల్లంపల్లి నుంచి గడ్డం వినోద్ గెలుపొందగా.. చెన్నూర్ నుంచి వివేక్ గెలుపొందారు. వీరిద్దరు బీఆర్ఎస్ అభ్యర్థులైన దుర్గం చిన్నయ్య, బాల్క సుమన్‌లను ఓడించారు.
ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి బ్రదర్స్ సత్తా చాటారు. నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డిని ఓడించారు. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీఆర్ఎస్ నేత కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై విజయం సాధించారు.