తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మరోసారి బీజేపీ నేత విజయశాంతి పైర్ అయ్యారు. దళిత సాధికారత పేరుతో కొత్త నాటకాలకు తెర తీస్తున్నారని విజయశాంతి మండిపడ్డారు. దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ ఘటనపై వెల్లువెత్తిన నిరసనలతో సీఎం కేసీఆర్ గారికి ఒక్కసారిగా దళిత సాధికారత గుర్తుకొచ్చిందా? అని నిలదీశారు. ఈ ఘటనపై పెల్లుబికుతున్న ఆగ్రహావేశాలను చల్లార్చడం కోసం అన్నట్టుగా రూ.1000 కోట్ల నిధులతో దళిత సామాజిక వర్గానికి ఏదేదో చేసేద్దామన్న ఆలోచనల్లో ఆయన ఉన్నట్టు కనిపిస్తోందని విమర్శించారు. అసలు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద గడచిన ఏడేళ్ళలో కనీసం రూ.70 వేల కోట్లు ఖర్చు చెయ్యాల్సి ఉండగా… ఇప్పటి వరకూ ఎంత ఖర్చు పెట్టారో లెక్క తీస్తే దళిత సాధికారత విషయంలో సీఎం గారి చిత్తశుద్ధిలోని బండారం బయటపడుతుందన్నారు.
read also : అట్టహాసంగా ఓ కీలక నేత బర్త్ డే వేడుకలు.. గిఫ్ట్ గా లక్షలు వసూలు !
”ఆయన మంత్రివర్గంలో ఉపముఖ్యమంత్రులుగా పనిచేసిన దళిత నేతలు రాజయ్య, కడియం శ్రీహరిలను పథకం ప్రకారం బయటకు పంపించిన తీరేంటో ప్రజలకు ఎరుకే…. అసలు ముఖ్యమంత్రి పదవినే దళితులకు కట్టబెడతానని, దళితులకు 3 ఎకరాల భూమినిస్తానని కేసీఆర్ చెప్పిన కల్లబొల్లి కబుర్లతో మొదలుపెట్టి… మరియమ్మ హత్య… ఎస్సీలపై పోలీసుల దాష్టీకాలు… ఇవన్నీ ఈ దొరహంకార టీఆరెస్ ప్రభుత్వ దుర్మార్గాలు తప్ప మరొకటి కాదు.” అంటూ విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.