IPL Tickets Block: 39 వేల టికెట్లు.. నిమిషాల్లో మాయం.! ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ వెనుక పెద్ద దందా.?

  • ఉప్పల్ మ్యాచ్ టికెట్లపై అభిమానుల ఆగ్రహం
  • నిమిషాల్లో సోల్డ్ అవుట్ అయిన 39 వేల సీట్లు
  • భారీగా పెరిగిన టికెట్ ధరలపై విమర్శలు
  • ఆన్‌లైన్ బుకింగ్ ప్రక్రియపై సందేహాలు
Ipl

Ipl

హైదరాబాద్ నగరంలోని క్రికెట్ ప్రేమికులకు ఉప్పల్ స్టేడియం మ్యాచ్ అంటేనే ఒక పెద్ద పండుగ. అయితే, రేపు జరగబోయే సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మ్యాచ్ టికెట్ల అమ్మకాల వెనుక పెద్ద ఎత్తున దందా నడిచిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సీజన్‌కు నగరంలో ఇదే చివరి మ్యాచ్ కావడం, దానికి తోడు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతుండటంతో అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ క్రేజ్‌ను సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ క్యాష్ చేసుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

సాధారణంగా రూ. 950 గా ఉండే కనీస టికెట్ ధరను ఏకంగా రూ. 1,950 కి పెంచేయడమే కాకుండా, సౌత్ స్టాండ్ కార్పొరేట్ బాక్స్ టికెట్ ధరను రూ. 30 వేల నుండి ఒకేసారి రూ. 45 వేలకు పెంచేశారు. దీనివల్ల సామాన్య క్రికెట్ ప్రేమికులకు మ్యాచ్ చూసే అవకాశం పూర్తిగా దూరమైంది. ఇంత భారీగా ధరలు పెంచినా సరే, మ్యాచ్ చూడాలనుకున్న ఫ్యాన్స్‌కు ఆన్‌లైన్ బుకింగ్స్‌లో తీవ్ర నిరాశే ఎదురైంది. జొమాటో డిస్ట్రిక్ట్ యాప్‌లో జరిగిన ఆన్‌లైన్ టికెట్ సేల్స్ ప్రక్రియ ఇప్పుడు అనేక అనుమానాలకు దారితీస్తోంది.

శుక్రవారం సాయంత్రం ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకాలు ప్రారంభించిన కేవలం నిమిషాల వ్యవధిలోనే ‘సోల్డ్ అవుట్’ (Sold Out) బోర్డు ప్రత్యక్షం కావడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం మొత్తం సామర్థ్యం 39 వేల సీట్లు. ఇందులో విఐపిలు, అధికారులకు ఇచ్చే ఉచిత కాంప్లిమెంటరీ పాసులు పోను.. సుమారు 30 నుండి 32 వేల టికెట్లు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంచాలి. కానీ, ఆన్‌లైన్ సేల్స్ ప్రారంభం కాగానే దాదాపు 3 లక్షల మందిని క్యూలో చూపించి, అసలు టికెట్లు బుక్ చేసుకునే లోపే వేలాది టికెట్లు కంటికి కనిపించకుండా మాయమైపోయాయి.

ఈ టికెట్ల మాయం వెనుక తెరవెనుక పెద్ద దందా నడిచిందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కంటితుడుపుగా ఆన్‌లైన్ బుకింగ్స్ ఓపెన్ చేసి, అభిమానులను బురిడీ కొట్టించి మెజారిటీ టికెట్లను బ్లాక్ మార్కెట్‌కు తరలించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆన్‌లైన్ లో అసలు సాధారణ ప్రజలకు ఎన్ని టికెట్లు అందుబాటులో ఉంచారు, ఇప్పటివరకు ఎన్ని టికెట్లు అమ్ముడయ్యాయి అనే పూర్తి వివరాలను సన్‌రైజర్స్ యాజమాన్యం బయటపెట్టకుండా దాచడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది.