Union Minister Kishan Reddy criticizes CM KCR: టీఆర్ఎస్ పార్టీని, కల్వకుంట్ల కుటుంబాన్ని ఎవరూ కాపాడలేరని.. తెలంగాణ సీఎం నెల విడిచి సాము చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆస్పత్రుల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి మహిళలు చనిపోతున్నారని.. ఇటీవల వరదల్లో చాలా మంది నష్టపోయారని.. హాస్టళ్లలో సరైన ఆహారం లేక విద్యార్థులు ఆందోళన చేస్తున్నారని .. దేశాన్ని ఉద్ధరిస్తా అని కేసీఆర్ అనేక రాష్ట్రాలు తిరుగుతున్నారని విమర్శించారు. కేసీఆర్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని .. దేశానికి నేనే దిక్కు అన్నట్లు సీఎం కేసీఆర్ ప్రచారం చేస్తున్నారని.. మోదీకి, బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ చేసిన ప్రచారాన్ని ఎవ్వరూ నమ్మడం లేదని.. సీరియస్ గా తీసుకోవడం లేదని.. పైగా నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు.
బీహార్ లో కేసీఆర్ మాటలు చూసి.. వినలేక సీఎం నితీష్ కుమార్ వెళ్లిపోతున్న పరిస్థితి ఉందని.. ఇద్దరు నాయకులు ప్రెస్ మీట్ లో కూర్చునే పరిస్థితి లేదని.. కేసీఆర్ అందర్నీ ఏకం చేస్తారట అంటూ ఎద్దేవా చేశారు. దేశంలో స్వదేశీ తయారీ పెరిగిందని..ఎన్ 95 మాస్కులు, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, వ్యాక్సిన్లు గతంలో దిగుమతి చేసుకునే వాళ్లం అని..కానీ ఇప్పుడు మనం విదేశాలకు ఎగుమతి చేస్తున్నామని అన్నారు. తెలంగాణ మోడల్ అంటే కల్వకుంట్ల తరహా మోడాలా..? అని ప్రశ్నించారు. కేసీఆర్ పాలన అంటే ప్రజలకు అందుబాటులో ఉండకూదదా.? అని ప్రశ్నించారు.
Read Also: Allu Aravind: అవును.. మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ కలుసుకోవడం లేదు.. కానీ
కేసీఆర్ తెలిసి మాట్లాడుతున్నారా..? తెలియక మాట్లాడుతున్నారా..? అని కేంద్రం మేకిన్ ఇండియాకు ప్రాధాన్యత ఇస్తోందని కిషన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిందే పదిసార్లు చెప్పి, ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ధర్నా చౌక్ పై నిషేధం పెట్టిన గొప్ప ప్రజాస్వామ్య వాది కేసీఆర్ అని విమర్శించారు. 15 శాఖలు కల్వకుంట్ల కుటుంబంలో పెట్టుకుని రాష్ట్రాన్ని పాలిస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో ఫండింగ్ ఇస్తానని తన పర్యటనల్లో అక్కడి పార్టీలకు హామీలు ఇస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ డబ్బులు యూపీ, బీహార్, పంజాబ్ రాష్ట్రాల్లో పంచుతున్నారని విమర్శించారు.
గతంలో బీహార్ రాష్ట్రానికి వ్యతిరేకంగా మాట్లాడి ఇప్పడెలా అక్కడికి కేసీఆర్ వెళ్లారని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారులను ప్రగతి భవన్ నుంచి నెట్టేశారని అన్నారు. ద్రోహులను వెంటపెట్టుకుని దేశానికి నీతులు చెబుతున్నారని దుయ్యబట్టారు. ఓ పక్క అసద్, మరోపక్క అక్బరుద్దీన్ పక్కన పెట్టుకుని మత రాజకీయాల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ మధ్య రాష్ట్రంలో జరిగిన అల్లర్లకు టీఆర్ఎస్ ప్రభుత్వమే కారణం అని ఆయన ఆరోపించారు. ఎన్నో రాష్ట్రాలు నిషేధం పెట్టిన కామెడీ షోను కోట్ల ఖర్చు పెట్టి, పోలీసుల రక్షణ ఇచ్చారని వ్యాఖ్యానించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మత ఘర్షణలు తగ్గయాని కిషన్ రెడ్డి అన్నారు.
కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు బీజేపీ భయపడదని.. ఈడీ, సీబీఐల గురించి కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారని.. సానుభూతి కోసం ముందే ఈడీ, సీబీఐ గురించి చెప్తున్నారంటూ విమర్శించారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. టీఆర్ఎస్ పార్టీని, కల్వకుంట్ల కుటుంబాన్ని ఎవరూ రక్షించలేరని..ఫామ్ హౌజ్ పాలన వద్దని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోతారని జోస్యం చెప్పారు. నార్త్ ఇండియన్స్ ఓట్లు తీసేయ్యాలని.. బీజేపీ బలంగా ఉన్న బూతుల్లో గతంలో ఇలాగే ఓట్లను తొలగించారని.. కేసీఆర్ కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని ఆరోపించారు. మునుగోడు ఎన్నికలు ఎప్పుడనేది కేంద్రఎన్నికల సంఘం నిర్ణయిస్తుందని అన్నారు. అసెంబ్లీ ముందస్తు ఎన్నికలకు పోతారని అంటున్నారని.. ఓట్లు తొలగించడం, నాయకులను బెదిరించడం చేస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. లిక్కర్ స్కాములో ఎవరున్నారనేది సీబీఐ నిర్ణయిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.