Allu Aravind: టాలీవుడ్ బడా నిర్మాత అల్లు అరవింద్ ప్రస్తుతం వరుస సినిమాలను నిర్మిస్తూ బిజీగా మారారు. ఏడాదికి ఒక్క సినిమా అయినా గీతా ఆర్ట్స్ నుంచి ఖచ్చితంగా వస్తుందనే చెప్పాలి. ఇక ఎన్నోరోజులుగా అల్లు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి మధ్య విబేధాలు తలెత్తాయని, ఇరు కుటుంబాలు మాట్లాడుకోవడం లేదని వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే అందులో ఎటువంటి నిజం లేదని అల్లు అరవింద్ స్పష్టం చేశారు. మొదటి నుంచి ఉన్న బంధమే ఇప్పుడు కూడా ఇరు కుటుంబాల మధ్య ఉందని తేల్చి చెప్పేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అరవింద్ మాట్లాడుతూ ” మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య విబేధాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. నేను ఇప్పటికీ బల్ల గుద్దిచెప్తున్నాను. అలాంటిదేమి లేదు. అయితే ఇరు కుటుంబాలు కలుసుకోవడం లేదు అన్నది వాస్తవమే.. ఎందుకంటే పిల్లలు పెద్దవారు అవుతున్నారు.. ఎవరి షూటింగ్స్ లో వారు బిజీగా ఉంటున్నారు. ఎవరికి సమయం కుదరడం లేదు. కానీ ఏదైనా పండగ వచ్చినా, ఫంక్షన్ వచ్చినా అందరు ఒక్క చోట చేరిపోతారు.
మా మధ్య సంబంధాలు తెగిపోయాయి అనేది కేవలం పుకారు మాత్రమే.. దాన్ని కూడా ఎవరో కావాలనే ప్రచారం చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్లపై రాళ్లు విసరడానికి చాలామంది ఎదురుచూస్తూ ఉంటారు. మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ ఎప్పుడూ కలిసే ఉంటుంది. ఇలా పనిగట్టుకొని ప్రచారం చేసేవారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పనీపాటా లేనివారు వీటిని సృష్టిస్తూ ఉంటారు” అని చెప్పుకొచ్చారు. ఇక అల్లు అరవింద్ వ్యాఖ్యలతో ఈ రూమర్స్ కు చెక్ పడుతుందేమో చూడాలి.