బండి సంజయ్ ప్రారంభించిన ఈ యాత్ర ఎవరినో ముఖ్యమంత్రిని చేయడానికో, బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికో కాదు.. తెలంగాణలో ఉన్న.. దళితులు, రైతులు, బడుగు బలహీన వర్గాలు, యువతను అభివృద్ధి పథంలో నడపడానికి. ఈ యాత్ర హైదరాబాద్ నిజాంను దింపే యాత్ర. కేసీఆర్ కుటుంబ పాలన నుంచి విముక్తి చేయడానికి ఈ యాత్ర.
తెలంగాణలో అవినీతిపాలన ప్రజా సంగ్రామ యాత్రలో బయటపడింది. ఎక్కడకు పోయినా.. టీఆర్‌ఎస్ పార్టీ వల్ల నష్టపోయిన ప్రజలు బయటకు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ రావాలే.. మోడీ రావాలే.. పువ్వు గుర్తుకే ఓటు వేస్తం అంటూ.. ఎన్నో వినతుల ఇచ్చారు. ఈ ప్రజా సంగ్రామ యాత్రను ముందుండి నడిపించిన ప్రతి కార్యకర్తకు ధన్యావాదాలు..
తెలంగాణలో రానున్న రోజుల్లో బీజేపీ జెండా పాతుడే.. అసెంబ్లీపై విజయపతాకం అమిత్ షా ఎగురవేస్తరు. తెలంగాణాను కేసీఆర్ కుటుంబానికి రాసిచ్చినమా.. ఇదేం నిజాం పరిపాలననా.. ఇక్కడికి ఎవరూ రాకూడదా.. ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. 1200 మంది ఆత్మబలిదానాలతో వచ్చిన తెలంగాణకు రావాలంటే కేసీఆర్ కుటుంబ పరిష్మన్ తీసుకోవాలా.. తెలంగాణపై కల్వకుంట్ల కుటుంబానికి ఎంత హక్కు ఉందో.. ప్రతి తెలంగాణ బిడ్డకు అంతే హక్కు ఉంది.
ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి టీఆర్‌ఎస్ భయం నెలకొంది. వారు చేయించుకున్న సర్వేల్లో టీఆర్‌ఎస్ పార్టీ ఓడిపోతుందని, బీజేపీ అధికారం రానుందని ఫలితాలు రావడంతో తండ్రి, కొడుకులు ఫ్రస్టేషన్‌లో ఉన్నరు. కేసీఆర్ అయితే ఫ్రస్టేషన్‌లో ఫాంహౌస్ నుంచి బయటకు వస్తలేరు.
టీఆర్ఎస్ నాయకులు సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నారు. బీజేపీ రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలు ఉత్తర ప్రదేశ్ నుంచి గోవా వరకు ఎన్నో ఉన్నాయి. చిన్న రాష్ట్రం గోవాలో రూ.2,500 పింఛన్ ఇస్తున్న ఘనత బీజేపీ. ఇది కళ్లుండి చూడలేని నాయకులు టీఆర్‌ఎస్ వాళ్లు.
తెలంగాణ బీజేపీ చీఫ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముందు ముందు అన్ని జిల్లాలో కొనసాగుతుంది. తెలంగాణ గడ్డమీద కేసీఆర్ అంటే గౌరవం ఉండేది. కానీ.. ఇవాళ తెలంగాణ గడ్డమీద ప్రజల చేత అసహ్యించుకోబడ్డ నాయకుడు కేసీఆర్.
శంషాబాద్‌లోని నొవాటెల్ హోటల్‌లో తెలంగాణ బీజేపీ కోర్ కమిటీతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భేటీ ముగిసింది. సమావేశం అనంతరం.. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ వాళ్లు వేసిన ప్రశ్నలకు మేము సమాధానం ఇస్తామని, అమిత్ షా లాంటి పెద్దవాళ్లు సమాధానం చెప్పేంత స్టేటస్ టీఆర్ఎస్ వాళ్లకు లేదన్నారు.
శంషాబాద్‌లోని నొవాటెల్ హోటల్‌లో తెలంగాణ బీజేపీ కోర్ కమిటీతో అమిత్ షా భేటీ ముగిసింది. అయితే.. కాసేపట్లో తుక్కుగూడ సభకు అమిత్ షా వెళ్లనున్నారు.
శంషాబాద్‌లోని నొవాటెల్ హోటల్‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేరుకున్నారు. అక్కడ బీజేపీ కోర్ కమిటీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ బీజేపీ సంస్థాగతంగా ఏవిధంగా బలోపేతం చేయాలనే అంశం సంబంధించి నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తోంది.
శంషాబాద్ నోవాటెల్ హోటల్ కు కేంద్ర హొంమంత్రి అమిత్ షా చేరుకున్నారు. మరికాసేపట్లో బీజేపీ తెలంగాణ కోర్ కమిటీ నేతలతో అమిత్ షా భేటీ కానున్నారు.
హైదరాబాద్ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీఎఫ్‌ఎస్‌ఎల్ క్యాంపస్‌ను సందర్శించారు. అక్కడ నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌ను ప్రారంభించారు. ఆ తరువాత సీఎఫ్‌ఎస్‌ఎల్ క్యాంపస్ కలియతిరుగూ.. అన్ని విభాగాలు పరిశీలించి.. శాస్త్రవేత్తలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరకున్నారు. సీఎఫ్‌ఎస్‌ఎల్ క్యాంపస్‌లో నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని అమిత్ షా ప్రారంభించనున్నారు. ఆ తర్వాత తెలంగాణ బీజేపీ కోర్ కమిటీ నేతలతో అమిత్ షా భేటీ కానున్నారు. ఆ సమావేశం ముగిశాఖ తుక్కుగూడ సభలో అమిత్ షా పాల్గొననున్నారు.
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రెండో దశ ముగింపు సభలో పాల్గొనేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్‌కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.
మధ్యాహ్నం 2.45కు బేగంపేటకు అమిత్ షా
మధ్యాహ్నం రెండున్నర గంటలకు బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా. అమిత్ షా కు స్వాగతం పలకనున్నారు 20 మంది బీజేపీ నేతలు. 15 నిముషాల పాటు విమానం ఆలస్యం.
హైదరాబాద్‌లోని CFSL క్యాంపస్‌లో ‘నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ లాబొరేటరీ’ ని ప్రారంభించేందుకు నేడు తెలంగాణకు రావడం ఉత్సాహంగా ఉంది. తుక్కుగూడ బహిరంగ సభలోనూ ప్రసంగించనున్నాను.
— Amit Shah (@AmitShah) May 14, 2022
ఎమ్మెల్సీ కవిత ట్వీట్ల తూటాలు
తెలంగాణ పర్యటనకు వస్తున్న కేంద్ర మంత్రి అమిత్ షాపై ట్విట్టర్ వేదికగా ఎమ్మెల్సీ కవిత ప్రశ్నల వర్షం కురిపించారు. రూ. 3000 కోట్లకు పైగా ఉన్న ఫైనాన్స్ కమీషన్ గ్రాంట్ల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు? అంటూ ప్రశ్నించారు. బ్యాక్‌వర్డ్ రీజియన్ గ్రాంట్ రూ. 1350 కోట్లు, GST పరిహారం రూ. 2247 కోట్ల సంగతేంటి? అని ఆమె ప్రశ్నించారు. బీజేపీ హయాంలో విపరీతంగా పెరిగిన ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, మతపరమైన అల్లర్లపై మీ సమాధానం ఏమిటి? అని ట్విటర్ వేదికగా అమిత్ షా పై ఎమ్మెల్సీ కవిత ప్రశ్నలతో ముంచెత్తారు.
భారత్‌ను అత్యంత ఖరీదైన ఇంధనం మరియు LPGని విక్రయించడంలో అగ్రగామి దేశంగా మార్చడంపై మీ సమాధానం ఏమిటి? అన్నారు. అమిత్ షా జీ, ఈ రోజు మీరు తెలంగాణ ప్రజలను కలిసినప్పుడు గత 8 సంవత్సరాలలో తెలంగాణకు ఒక్క IIT, IIM, IISER, IIIT, NID, మెడికల్ కాలేజీ లేదా నవోదయ పాఠశాలలు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు విఫలమైందో తెలంగాణ బిడ్డలకు వివరించండి అంటూ కవిత ఎద్దేవా చేశారు.
తెలంగాణలో ఎన్నికల ఫీవర్
తెలంగాణలో ఎన్నికల ఫీవర్ మొదలయిందా? వేసవి వేడికి తోడు ఎన్నికల వేడి కూడా తెలంగాణ నేతల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నేతల పాదయాత్రలు, జాతీయ నేతలతో పర్యటనలతో రాష్ట్ర రాజకీయం రసవత్తరంగా మారుతోందని చెప్పాలి. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించారు. వరంగల్ డిక్లరేషన్ అంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎన్నికల శంఖారావం దాదాపుగా పూరించారని చెప్పాలి. తాజాగా కేంద్రహోంమంత్రి అమిత్ షా కూడా ఇవాళ హైదరాబాద్‌కు వస్తున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు అమిత్ షా. ఇవాళ సాయంత్రం తుక్కుగూడలో జరిగే బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగిస్తారు. ఈ సభ ద్వారా ఎన్నికల శంఖారావం పూరిస్తారని... టీఆర్ఎస్‌పై యుద్ధం ప్రకటించే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
తుక్కుగూడ సభకు బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. అప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. తెలంగాణ నలుమూలల నుంచి కార్యకర్తలు హైదరాబాద్‌కు వస్తున్నారు. ఇటీవలే వరంగల్‌లో రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభ నిర్వహించారు. అంతకు మించి జనసమీకరణ చేయాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు తగ్గట్లే ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు, ఎమ్మెల్యేలు సభ ఏర్పాట్లను పరిశీలించారు. హైదరాబాద్‌లో అమిత్ షా పర్యటనకు సంబంధించి కేంద్ర హోంశాఖ షెడ్యూల్ విడుదల చేసింది.
అమిత్ షా షెడ్యూల్:
12:10 - న్యూఢిల్లీలోని కృష్ణ మీనన్ మార్గ్ నుంచి కేంద్రహోంమంత్రి అమిత్ షా బయల్దేరతారు
12:30 - పాలెం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు బయల్దేరతారు
2:30 - హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు
2:55 - రామాంతపూర్‌లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి చేరుకుంటారు
3.00-4:00 - CFSLలోనే సుమారు గంట సమయం పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
5:00 - రోడ్డుమార్గంలో శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌కు చేరుకుంటారు. సాయంత్రం 6 గంటల వరకు అక్కడే ఉంటారు.
6:25 - రింగ్ రోడ్డు మీదుగా తుక్కుగూడకు చేరుకుంటారు
6:30-8:00 - తుక్కుగూడలో ప్రజా సంగ్రామయాత్ర బహిరంగ సభలో పాల్గొంటారు.
8:20 - శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ చేరుకొని.. విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.
అమిత్ షా పర్యటనపై బీజేపీ నేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ పర్యటనలోనే ఆపరేషన్ ఆకర్ష్ వేగవంతం చేయనున్నారు. అందులో భాగంగా చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీలో చేరతారని సమాచారం. ఆయనతో పాటు మరికొందరు నేతలు కూడా కాషాయ కండువా కప్పుకుంటారని అంటున్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. గద్వాల్ జిల్లాలోని అలంపూర్‌లోని జోగులాంబ దేవి ఆలయంలో ప్రార్థనలు చేసిన తర్వాత తన పాదయాత్రను ప్రారంభించారు. టీఆర్ఎస్ వైఫల్యాలు, ప్రజల ఇబ్బందులను ఆయన పాదయాత్రలో స్వయంగా తెలుసుకుంటున్నారు. ఈ పాదయాత్ర నేటితో మహేశ్వరంలో ముగుస్తుంది. ఈ సందర్భంగానే బీజేపీ నేతలు బహిరంగ సభను ఏర్పాటు చేసి హోంమంత్రి అమిత్ షాను ఆహ్వానించారు.