గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు వెంటనే చేపట్టాలని టిఎస్ యుటిఎఫ్ గురుకులం రాష్ట్రకమిటీ డిమాండ్ చేసింది. సోమవారం టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో హరీందర్ రెడ్డి అధ్యక్షతన టిఎస్ యుటిఎఫ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (గురుకులం) ఉపాధ్యాయుల విభాగం రాష్ట్ర కమిటీ సమావేశమైంది. ఈ భేటీలో టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి, కోశాధికారి టి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
Also Read: Ponnam Prabhakar: కేటీఆర్ ఓటమిని జీర్ణించుకోలేక స్వేదపత్రం పేరిట తప్పుడు లెక్కలు
ఈ సందర్భంగా చావ రవి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 160 గురుకులాలు, 23 ఏకలవ్య ఆదర్శ గురుకులాలు గురుకులం సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నాయన్నారు. ఈ విద్యాసంస్థల్లో 2018, 2019 సంవత్సరాల్లో నియామకమైన ఉపాధ్యాయులకు ఆరేళ్ళైనా రెగ్యులరైజేషన్ ఉత్తర్వులు, బదిలీలు, పదోన్నతులు నిర్వహించకపోవటం శోచనీయమన్నారు. ఉపాధ్యాయులపై బోధనేతర పనుల భారాన్ని తగ్గించాలని, శ్రమకు తగిన వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. జీవో 317, పీఆర్సీలో కరస్పాండింగ్ స్కేలు వర్తింపు, 2008 లో రెగ్యలరైజ్ అయిన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపు వంటి అంశాలపై హైకోర్టు తీర్పులను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Also Read: Christmas Drone Show: క్రిస్మస్ వేళ ఆకాశంలో అద్భుతం.. గిన్నిస్ రికార్డుకు ఎక్కిన డ్రోన్ షో
అనంతరం టిఎస్ యుటిఎఫ్ కు అనుబంధంగా గురుకులం ఉపాధ్యాయుల విభాగం రాష్ట్ర కమిటీ ఎన్నికల్లో అధ్యక్షులుగా డా. బి సురేందర్, ప్రధాన కార్యదర్శిగా వి హరీందర్ రెడ్డి, కోశాధికారిగా : ఎస్ రవికుమార్, ఐదుగురు ఉపాధ్యక్షులు, ఐధుగురు కార్యదర్శులు, పదిమంది కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో నాయకులు ఎస్ ఉపేందర్, డి వెంకన్న, ఎం పావని, కె నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.