కరోనా మహమ్మారి కారణంగా కొన్ని పరీక్షలు రద్దు కాగా.. మరికొన్ని పోటీ పరీక్షలను వాయిదా వేస్తూ వస్తోంది తెలంగాణ ప్రభుత్వం.. లాక్‌డౌన్ నేపథ్యంలోనూ మరికొన్ని పరీక్షలు వాయిదా పడుతున్నాయి.. ఇక, జులైలో జరగనున్న ఎంసెట్ పరీక్షలకు దరఖాస్తు గడువును మరోసారి పొడిగించింది ప్రభుత్వం.. ఎంసెట్ ఆన్‌లైన్ దరఖాస్తులను ఎలాంటి అపరాద రుసుం లేకుండా ఈ నెల 24వ తేదీ వరకు స్వీకరించనున్నట్టు ఎంసెట్ కన్వీనర్ ప్రకటించారు.. లాక్‌డౌన్ కారణంగా.. విద్యార్థుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎ. గోవర్ధన్ వెల్లడించారు.
ఎంసెట్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో జెఎన్‌టీయూ నిర్వహిస్తుండగా.. ఎంసెట్ దరఖాస్తు గడువు మే 18న ముగిసిపోయింది.. కానీ, కరోనా మహమ్మారి, లాక్‌డౌన్ కారణంగా.. ఇప్పటి వరకు నాలుగుసార్లు దరఖాస్తుల గడువునూ పొడిగిస్తూ వచ్చారు.. తాజా నిర్ణయం ప్రకారం.. ఈ నెల 24వ తేదీతో ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు ముగియనుండగా.. ఎంసెట్ ను జూలై 5 నుంచి 9 తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌మోడ్‌లో నిర్వహించనున్నారు.. మొత్తం 9 సెషన్లలో పరీక్షలు జరగనుండగా.. అగ్రికల్చర్ వారికి 3, ఇంజినీరింగ్ వారికి 5 సెషన్లు, మరో సెషన్‌ను అవసరాన్ని బట్టి నిర్వహిస్తామని.. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు ఎంసెట్ కన్వీనర్.