హైదరాబాద్ మాదాపూర్ హెచ్‌ఐసీసీ వేదికగా టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం ప్రారంభమైంది. ఇప్పటికే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ ఛైర్మన్‌లు, పార్టీ అధ్యక్షులు, మున్సిపల్ మేయర్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌లు ఒక్కొక్కరుగా హాజరవుతున్నారు. ఈ ప్లీనరీ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ మొత్తం 13 తీర్మానాలు చేయనుంది. జాతీయ రాజకీయాలపై మంత్రి కేటీఆర్ తీర్మానం చేయనున్నారు. వరి కొనుగోలుపై మంత్రి నిరంజన్‌రెడ్డి తీర్మానం చేయనున్నారు. ధరల పెరుగుదలపై పల్లా రాజేశ్వర్‌రెడ్డి తీర్మానం చేయనున్నారు.
మరోవైపు కేంద్ర పన్నుల వాటాపై మంత్రి హరీష్‌రావు తీర్మానం చేస్తారు. కృష్ణా జలాల వివాదంపై కడియం శ్రీహరి తీర్మానం చేస్తారు. భారత రాజ్యాంగ విలువలను కాలరాస్తున్న కేంద్ర వైఖరిపై పోరాటం చేయాలని నామా నాగేశ్వరరావు తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. దళితబంధు పథకం దేశవ్యాప్తంగా అమలు చేయాలని సండ్ర వెంకట వీరయ్య తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదింపచేయాలంటూ మంత్రి సత్యవతి రాథోడ్ తీర్మానం చేయనున్నారు. భారత సామరస్య సంస్కృతిని కాపాడుకోవాలని, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని మాజీ ఎంపీ వినోద్ తీర్మానం చేయనున్నారు. బీసీ వర్గాలకు కేంద్ర ప్రభుత్వంలో బీసీ సంక్షేమమంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, బీసీ వర్గాల జనగణన జరపాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ మధుసూదనాచారి తీర్మానం చేయనున్నారు.
తెలంగాణ రాష్ట్ర సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్ శాతం పెంచాలని, ఎస్సీ వర్గీకరణ తక్షణమే చేయాలని డిమాండ్ చేస్తూ హోంమంత్రి మహమూద్ అలీ తీర్మానం చేయనున్నారు. తెలంగాణలో నవోదయ విద్యాలయాలను, వైద్య కళాశాలలను వెంటనే ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీర్మానం చేయనున్నారు. చేనేత వస్త్రాలపై కేంద్రం విధించిన జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఎల్.రమణ తీర్మానం చేయనున్నారు.