Tragedy : ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్‌గూడెంలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. ఆడుకుంటూ చేసిన ఒక చిన్న పొరపాటు ఆరేళ్ల బాలుడి ప్రాణాలను బలితీసుకుంది. నాయకన్‌గూడెం గ్రామానికి చెందిన ఆరేళ్ల విహార్ రోజూలాగే స్కూల్‌కు వెళ్తూ, తన పెన్సిల్‌ను చొక్కా జేబులో పెట్టుకున్నాడు. తోటి స్నేహితులతో కలిసి ఉత్సాహంగా ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా పట్టుతప్పి బోర్లా కిందపడిపోయాడు. దురదృష్టవశాత్తు ఆ సమయంలో జేబులో ఉన్న పెన్సిల్ మొన పైకి ఉండటంతో, బాలుడు కింద పడిన వేగానికి ఆ పెన్సిల్ నేరుగా విహార్ ఛాతిలోకి బలంగా దూసుకుపోయింది.
పెన్సిల్ గుచ్చుకోవడంతో తీవ్ర రక్తస్రావం కావడం, కీలకమైన భాగంలో దెబ్బతగలడంతో బాలుడు అక్కడికక్కడే విలవిలలాడాడు. గమనించిన స్థానికులు, పాఠశాల సిబ్బంది వెంటనే బాలుడిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ, గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆసుపత్రికి చేరుకునేలోపే విహార్ మార్గమధ్యలో కన్నుమూశాడు. రోజూ నవ్వుతూ కళ్లముందు తిరిగే పిల్లాడు, ఇలా పెన్సిల్ గుచ్చుకొని మరణించాడన్న వార్త వినగానే తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. కొడుకు చిన్న వయసులోనే మృత్యువాత పడటంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటన చిన్న పిల్లల పట్ల ఎంత అప్రమత్తంగా ఉండాలో, వారు వాడే వస్తువుల విషయంలో ఎంత జాగ్రత్త వహించాలో మరోసారి గుర్తు చేస్తోంది.