బీసీసీఐకి మోసిన్ నఖ్వీ క్షమాపణలు.. కానీ మళ్లీ ఓ మెలిక పెట్టాడుగా!
ఆసియా కప్ 2025 ముగిసి మూడు రోజులైనా ‘ఫైనల్’ వేడి మాత్రం ఇంకా తగ్గలేదు. ట్రోఫీని ఇవ్వకుండా తన వద్దే పెట్టుకున్న ఏసీసీ ఛైర్మన్, పీసీబీ చీఫ్ మోసిన్ నఖ్వీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయాడు. నఖ్వీ వైఖరిపై మంగళవారం జరిగిన ఏసీసీ ఏజీఎంలో అసంతృప్తి వ్యక్తం చేసిన బీసీసీఐ.. ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకూ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో నఖ్వీ వెనక్కి తగ్గాడు. ఏసీసీ భేటీలో బీసీసీఐకి క్షమాపణలు చెప్పాడు. అయితే పీసీబీ చీఫ్ మోసిన్ నఖ్వీ బీసీసీఐకి క్షమాపణలు చెప్పినా.. ట్రోఫీ, మెడల్స్‌ను అందించేందుకు నిరాకరించాడు. ట్రోఫీ, మెడల్స్‌ను బీసీసీఐకి ఇవ్వకూడని నఖ్వీ మొండిగా ఉన్నట్లు తెలుస్తోంది. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దుబాయ్‌కు వచ్చి ట్రోఫీని తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఆసియా కప్ ట్రోఫీ ఉత్కంఠ కొనసాగుతున్నప్పటికీ నఖ్వీ నేడు యూఏఈ నుంచి లాహోర్‌కు బయలుదేరుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో ఐసీసీ జోక్యం చేసుకుని ఓ కొలిక్కి తీసుకొస్తుందో చూడాలి.
రాజమండ్రి – తిరుపతి మధ్య విమాన సర్వీసులు స్టార్ట్.. రూ.1,999కే..
రాజమండ్రి నుంచి తిరుపతి.. తిరుపతి నుంచి రాజమండ్రి వెళ్లే భక్తులు, ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది విమానయాన శాఖ.. ఇవాళ రాజమండ్రి – తిరుపతి మధ్య నూతన విమాన సర్వీసును ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురందేశ్వరి.. రాజమండ్రి – తిరుపతి మధ్య అలయన్స్ ఎయిర్ ఆధ్వర్యంలో వారానికి మూడు రోజులు అంటే, మంగళ, గురు, శనివారాల్లో ఈ విమాన సర్వీసులు నడిపించనున్నారు.. ఇవాళ ఉదయం 7:40కు తిరుపతి నుంచి బయలుదేరి 9:25కు రాజమండ్రి చేరుకుంది తొలి విమానం.. ఇక, ఉదయం 9:50కు రాజమండ్రి నుంచి బయలుదేరి 11:20కి తిరుపతి చేరుకొంది.. ఈ విమాన సర్వీసుతో రాజమండ్రి–తిరుపతి మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గిపోయినట్టు అయ్యింది.. ముందుగా బుక్ చేసుకుంటే మొదటి 30 టికెట్లు 1999 రూపాయలు మాత్రమే కాగా.. మిగిలిన 40 టిక్కెట్లు 4000 రూపాయలకే అందుబాటులో ఉంచనున్నట్టు అలయన్స్ ఎయిర్ ప్రతినిధులు చెబుతున్నారు..
దసరా తర్వాత విద్యా సంస్థలు బంద్!
తెలంగాణ రాష్ట్రంలో మరోసారి బంద్ దిశగా ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు అడుగులు వేస్తున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయని నేపథ్యంలో 2025 దసరా పండగ తర్వాత (అక్టోబర్ 6 నుంచి) విద్యా సంస్థలు తెరవొద్దని కాలేజీ యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే విద్యా సంస్థలు బంద్‌పై కాలేజీ యాజమాన్యాలు అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. ఇటీవల రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. సెప్టెంబర్ 15 నుంచి నిరవధిక బంద్‌కు కాలేజీల యాజమాన్యాలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. బంద్ విద్యార్థుల చదువుపై ప్రభావం చూపుతుందని ప్రభుత్వం కాలేజీల యాజమాన్యాలతో చర్చలు జరిపింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన చర్చలలో కాలేజీల యాజమాన్యాలు వెనక్కి తగ్గాయి. ప్రభుత్వంతో చర్చల అనంతరం దసరా వరకు పెండింగ్‌లో ఉన్నమొత్తం బకాయిల్లో రూ.600 కోట్లను విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం చెప్పారు. అయితే డిప్యూటీ సీఎం ప్రకటన చేసి రెండు వారాలు గడుస్తున్నా.. ప్రభుత్వం ఇంకా బిల్లులను విడుదల చేయలేదు.
కీచకపర్వం.. ప్రియుడి గొంతుపై కత్తి పెట్టి.. ప్రియురాలి గ్యాంగ్ రే*ప్..
చిత్తూరులో జిల్లాలో మాటలకందని అమానుషం చోటుచేసుకుంది. నగరంలోని అటవీ శాఖ పార్కులో పట్టపగలు ఒకరి తర్వాత ఒకరుగా సాగించిన కీచకపర్వానికి ఓ బాలిక జీవితం బలయ్యింది. ప్రియుడు గొంతుపై కత్తి పెట్టి.. బాలికను బెదిరించి అతని కళ్లెదుటే కామాంధులు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగుచూసిన గ్యాంగ్ రేప్ ఘటన చిత్తూరు నగరంలో కలకలం రేపింది. నిందితులు రాజకీయ కార్యకర్తలు కావడం అధికార,విపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలకు వేదికైంది. పట్టపగలు.. మిట్ట మధ్యాహ్నం ఓ ప్రేమ జంటను ముగ్గురు యువకులు బెదిరించి బాలికపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి ఒడిగట్టారు. చిత్తూరు జిల్లాలో గత నెల 25న జరిగిన ఈ ఘటన ఆదివారం వెలుగు చూడగా.. పోలీసులు ఆలస్యంగా కేసు నమోదు చేశారు.
దసరాకి 8 వేల ప్రత్యేక బస్సులు.. తాత్కాలిక బస్‌స్టాండ్‌లు ఏర్పాటు!
2025 దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్ నగర వాసులు సొంతుళ్లకు పయనమవుతున్నారు. ప్రస్తుతం బస్‌స్టాండ్‌లు అన్ని జనాలతో కిక్కిరిసిపోయాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. దసరాకి ప్రత్యేకంగా 7754 బస్సులను ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసింది. జేబీఎస్, ఎంజీబీఎస్‌తో పాటు ఆరంఘర్, ఎల్బీ నగర్, ఉప్పల్ వంటి రద్దీ ప్రాంతాల్లో తాత్కాలిక బస్ స్టాండ్‌లను ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేశారు. గతంలో పండగలకు జనాలు ఆర్టీసీ బస్సులలో కిక్కిరిసిన రద్దీతో వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు పండగలకు అధిక సంఖ్యలో బస్సులను ఏర్పాటు చేయడంతో.. ప్రయాణికులు ప్రశాంతంగా జర్నీ చేస్తున్నారు. బస్సులు చాలా ఉండడంతో చాల మంది ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక 2013 జీవో ప్రకారమే పండగలకు అదనపు చార్జీలు వసూలు చేస్తున్నామని ఆర్టీసీ అధికారులు చెప్పారు. రిటర్న్ జర్నీ ఖాళీగా రావాల్సి వస్తుండటంతో.. చాలా మినిమం చార్జీలు వసూలు చేస్తున్నామని తెలిపారు. రేపే దసరా కాబట్టి ఇప్పటికే సగానికి పైగా సిటీ ఖాళీ అవ్వగా.. రాత్రికి మొత్తం ఖాళీ అయ్యే అవకాశం ఉంది.
మరే ఇతర రాష్ట్రాల్లో ఈ పరిస్థితి లేదు..
ఒక్కప్పుడు పండగ చేసుకోవడం అంటే భయం.. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు.. ఒకటో తారీఖునే పెన్షన్ వస్తోంది.. ఇది కూటమి ప్రభుత్వం సత్తా.. మరే ఇతర రాష్ట్రాల్లో ఈ పరిస్థితి లేదు అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. విజయనగరం జిల్లా దత్తిలో పర్యటించిన ఆయన.. లబ్ధిదారులకు పెన్షన్లు అందించారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆర్థిక భరోసా కల్పిస్తున్నాం.. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందిస్తున్నాం అన్నారు.. రాష్ట్రవ్యాప్తంగా 63 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం.. గతంలో ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే పెన్షన్ కట్ అయిపోయేది… ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.. మూడు నెలలు వరకూ చూస్తున్నాం.. మీరు మట్టి పనులకు వెళ్లినా అక్కడికే వచ్చి పెన్షన్ ఇస్తున్నాం అన్నారు.. ఫించన్లు ఇంచిందే టీడీపీ ప్రభుత్వమని గుర్తుచేసిన ఆయన.. దేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి.. ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా పెన్షన్ ఇస్తున్నాం.. ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పెన్షన్ కు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది… మరే ఇతర రాష్ట్రం ఇలా ఇవ్వడం లేదన్నారు..
కరూర్ తొక్కిసలాట.. విజయ్ రాష్ట్ర వ్యాప్త పర్యటన రద్దు.
తమిళనాడులో టీవీకే పార్టీ అధినేత, స్టార్ యాక్టర్ విజయ్ నిర్వహించిన ర్యాలీ విషాదకరంగా ముగిసింది. కరూర్ లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఇది ఆ రాష్ట్రంలో రాజకీయంగా విమర్శలు ప్రతివిమర్శలకు కారణమైంది. అధికార డీఎంకే పార్టీ మాట్లాడుతూ.. విజయ్ పోలీసుల నిబంధనలు, నియమాలను ఉల్లంఘించినట్లు ఆరోపించింది. ఈ వ్యవహారంలో డీఎంకే కుట్ర ఉందని విజయ్ పార్టీ ఆరోపించింది. స్వతంత్ర సంస్థ లేదా సీబీఐ ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది.
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 3 శాతం పెంచింది. కొత్త డీఏ జూలై 1 నుంచి అమలులోకి రానుంది. 49.2 లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. మరోవైపు.. 57 నూతన కేంద్రీయ విద్యాలయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పప్పు దినుసులు కోసం ఆత్మనిర్భర్ భారత్ కింద రూ.11,440 కోట్లు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 2026-27 రబీ సీజన్ కోసం కనీస మద్దతు ధరల పెరిగింది. కుసుమలకు క్వింటాలుకు 600 రూపాయలు, మైసూరు పప్పుకు క్వింటాల్ కు 300 రూపాయలు, ఆవాలకు క్వింటాలుకు 250 రూపాయలు పెంచుతూ కేంద్ర నిర్ణయం తీసుకుంది.
ట్రైసిటీలో దసరా ఉత్సవాల.. ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..
ఉర్సు రంగాలీల మైదానంలో అక్టోబర్ 2న జరగబోయే దసరా ఉత్సవాల సందర్భంలో ట్రైసిటీ పరిధిలో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. ఈ ఆంక్షలు 2025 అక్టోబర్ 2 మధ్యాహ్నం 3 గంటల నుండి అక్టోబర్ 3 ఉదయం 5 గంటల వరకు అమల్లో ఉంటాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపీఎస్ తెలిపారు.
వదలా అంటున్న వానలు.. ఏపీ, తెలంగాణలో మళ్లీ వర్షాలే..!
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను వరుణుడు ఏమాత్రం వదిలిపెట్టడం లేదు. మొన్నటి వాయుగుండం ప్రభావం పూర్తిగా తగ్గక ముందే.. మరో అల్పపీడనం కదలికలు ప్రారంభించింది. ఇది వాయుగుండంగా మారే అవకాశముందని, వచ్చే నాలుగు రోజులపాటు రెండు రాష్ట్రాల్లోనూ వర్షాలు తప్పవని వాతావరణశాఖ హెచ్చరించింది. గత కొన్ని నెలలుగా ఏపీ, తెలంగాణలో వర్షాలే ప్రధాన సమస్యగా మారాయి. కాలం మారినా వానలు మాత్రం ఆగడంలేదు. కొన్నిచోట్ల కుండపోతగా కురుస్తూ జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఇటీవల బంగాళాఖాతంలోని వాయుగుండం కారణంగా రెండు మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిశాయి. ఇప్పుడు మళ్లీ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.