ఇంటర్ విద్యార్థినితో ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన.. కుటుంబీకుల ఆందోళన
విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించి వారి భవిష్యత్తుకు పాటుపడాల్సిన కొందరు ఉపాధ్యాయులు బుద్ది లేకుండా వ్యవహరిస్తున్నారు. విద్యార్థులు తప్పులు చేస్తే సరిచేయాల్సిందిపోయి టీచర్లే తప్పుడు పనులకు పూనుకుంటున్నారు. కొందరి ఉపాధ్యాయుల ప్రవర్తన, ఉపాధ్యాయలోకానికే మాయని మచ్చగా మారింది. తాజాగా వరంగల్ లో దారుణం చోటుచేసుకుంది. ఇంటర్ విద్యార్థినితో ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగుచూసింది. విషయం తెలిసిన విద్యార్థిని కుటుంబ సభ్యులు కాలేజీ ముందు ఆందోళనకు దిగారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేస్తోన్న హైడ్రాను.. ఓల్డ్ సిటీలో అమలు చేయగలరా..?
హైదరాబాద్ మహానగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించిన నిజామాబాద్ ఎంపీ డి. అర్వింద్ కుమార్, ఓల్డ్ సిటీలో కూడా ఇదే తీరుగా చర్యలు తీసుకోవాలా? అని సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డికి నిజమైన ధైర్యముంటే ఓల్డ్ సిటీలో అడుగుపెట్టగలరా? అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. ఆదివారం నిజామాబాద్‌లో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హిందూ-ముస్లింలపై ఆదాయంపై ఆధారపడి ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో భూ స్థాపితమవుతున్న బీఆర్ఎస్ పార్టీకి ఇక ప్రజల్లో ఆదరణ లేదని, ఆ పార్టీ అధినేత కేసీఆర్ శకం ముగిసిపోయిందని అన్నారు.
భారతదేశాన్ని కాషాయమయం చేయడమే తన లక్ష్యమని స్పష్టంగా వెల్లడించిన ఎంపీ అర్వింద్, రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు బాధ్యతగా ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హామీలు నెరవేర్చడంలో విఫలమైందని విమర్శిస్తూ, ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాటలను నిలబెట్టుకోలేకపోయారని ఎద్దేవా చేశారు.
ఆర్‌ఎస్ఎస్ నెక్ట్స్ టార్గెట్ ఇదే.. సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం
సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ 10 రోజుల బెంగాల్‌లో పర్యటిస్తున్నారు. నేడు నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఆర్‌ఎస్ఎస్ తదుపరి కార్యాచరణపై ఆయన వివరణ ఇచ్చారు. హిందూ సమాజం వైవిధ్యం ఐక్యతలో ఉందని నమ్ముతుందని అన్నారు. సంఘ్ లక్ష్యం హిందూ సమాజాన్ని ఏకం చేయడమే అని స్పష్టం చేశారు. హిందూ సమాజం మరింత ఐక్యంగా ఉండాలని పునరుద్ఘాటించారు. మంచి సమయాల్లోనూ సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.. దానికి సమాజంలోని ప్రజల మధ్య ఐక్యత అవసరమని వెల్లడించారు. ప్రజలు దేశాన్ని పాలించిన చక్రవర్తులు, మహారాజులను గుర్తు పెట్టుకోరని.. తండ్రి వాగ్దానాన్ని నెరవేర్చడానికి 14 ఏళ్లు అజ్ఞాతవాసం చేసిన రాజు(రాముడు)ను గుర్తుంచుకుంటారని అన్నారు.
ప్రకాశం జిల్లాలో వేటగాళ్ల ఉచ్చులో పడి చిరుత మృతి.. కొనసాగుతున్న దర్యాప్తు..
ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం మండలం కొలుకుల ఆటవీ ప్రాంతంలో వేటగాళ్ల ఉచ్చులో పడి చిరుత పులి మృతి చెందింది. కొలుకుల ఆటవీ ప్రాంతంలో కుందేళ్లను పట్టుకోవడానికి ఉచ్చులను ఏర్పాటు చేసిన వేటగాళ్ళు.. కుందేలు కోసం ఏర్పాటు చేసిన ఉచ్చులో పడి మృతి చెందిన చిరుత పులి.. పులి మరణించడంపై ఫారెస్ట్ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో సంచలనంగా మారిన చిరుత పులి మృతి వ్యవహారం. చిరుత పులి ఉచ్చులో పడి ప్రమాదవ శాత్తు చనిపోయిందా… లేక ఉచ్చు బిగించి కావాలనే చిరుత పులిని చంపారా అనే కోణంలో అటవీ శాఖ అధికారుల విచారణ చేస్తున్నారు. సమీప ప్రాంతాల్లోని వేటగాళ్లను ఆరా తీస్తున్నారు.
మస్తాన్ సాయి కేసు.. ఏపీ గవర్నర్‌కు లావణ్య లేఖ..
ఏపీ గవర్నర్ అబ్ధుల్ నజీర్ కి లావణ్య తరపు న్యాయవాది నాగూర్ బాబు లేఖ రాశారు. మస్తాన్ సాయి నేరాల వల్ల దర్గాకు అపవిత్రం కలుగుతుందని లేఖలో వివరించారు. గుంటూరు మస్తాన్ దర్గా ధర్మకర్తలుగా మస్తాన్ సాయి కుటుంబాన్ని తొలగించాలని లేఖలో ప్రస్తావించారు. లేఖలను గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, సి ఎస్, మైనారిటీ సంక్షేమ శాఖకి పంపించారు. లావణ్య రాజ్ తరుణ్‌ల వివాదం ఆ మధ్య తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడిగా మస్తాన్ సాయి ఉన్నాడు. మస్తాన్ సాయిపై ఇప్పటికే మహిళల నగ్న చిత్రాలు, డ్రగ్స్ కేసులు, అత్యాచారం, ఇలా సుమారు ఐదు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం మస్తాన్ సాయి నార్సింగి పోలీసుల కష్టడీలో ఉన్నాడు. కాగా.. గుంటూరు మస్తాన్‌దర్గాలో మస్తాన్ కుటుంబం ధర్మ కర్తలుగా కొనసాగుతున్నారు. ఈ నేరాలు చేసిన మస్తాన్‌ను ఈ బాధ్యత నుంచి తొలగించాలని.. కొనసాగితే.. భక్తుల భద్రత, దర్గా ప్రతిష్టతకు భంగం వాటిల్లుతుందని లేఖలో న్యాయవాది నాగూరు బాబు పేర్కొన్నారు.
ఐపీఎల్ షెడ్యూల్ రిలీజ్.. తొలి మ్యాచ్ ఆర్సీబీ-కేకేఆర్, ఫైనల్ మే 25
ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ నుంచి మంచి న్యూస్ అందింది. ఐపీఎల్ (IPL 2025) ఫుల్ షెడ్యూల్ రిలీజ్ అయింది. మార్చి 22న ఈడెన్ గార్డెన్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. మార్చి 23న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య చెన్నై చెపాక్ స్టేడియంలో జరుగనుంది. మార్చి 23న తొలి డబుల్ హెడర్ మ్యాచ్ జరగనుంది. గత సీజన్ ఫైనలిస్ట్‌లైన సన్‌రైజర్స్ హైదరాబాద్.. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. 2025 సీజన్ ఫైనల్ మే 25న ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతుంది.
పదవిలో ఉన్న లేకపోయినా.. ప్రజలకు అందుబాటులో ఉంటా
నందిగామలో మాజీ ఎంపీ కేశినేని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను రాజకీయాల నుంచి తప్పుకున్నా ప్రజా సేవలో ఎప్పడు ఉంటాను.. నాకు విజయవాడ అంటే మమకారం పిచ్చి.. విజయవాడ నాకు రెండు సార్లు ఎంపీగా పని చేసే అవకాశం కల్పించింది అని పేర్కొన్నారు. నేను నా ఎంపీ పదవిని ఎప్పడు నా స్వార్థానికి వాడుకోలేదు.. పదేళ్ల పాటు ఎంపీగా ఉన్నాను.. విజయవాడకు ఏమైనా చేసిన వ్యక్తి అంటే రతన్ టాటా.. కేంద్రమంత్రి గడ్కరీతో కలిసి అసాధ్యమైన దుర్గ గుడి ఫ్లై ఓవర్ నిర్మించాను అని ఆయన చెప్పుకొచ్చారు.
నిబద్ధత ఉన్న ఆఫీసర్లు ఎక్కడ ఉన్నా పోస్టింగ్‌లు వస్తాయి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఐఏఎస్ అధికారులు ఎంతో కట్టుదిట్టంగా పని చేసేవారని, కానీ ఇప్పుడు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. ప్రస్తుత అధికారి వర్గం కేవలం ఏసీ గదుల్లోనే పరిమితం అయ్యారని, ప్రజలకు అందుబాటులో లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లో జరిగిన ‘లైఫ్ ఆఫ్ ఏ కర్మయోగి’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. సీనియర్ ఐఏఎస్ అధికారుల అనుభవాలను నేటి ఐఏఎస్‌లు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. గత ఐఏఎస్ అధికారులు ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను నేరుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేసేవారని, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని వ్యాఖ్యానించారు.
గతంలో ఐఏఎస్ అధికారులు రాజకీయ నాయకులకు ప్రామాణిక సమాచారాన్ని అందించేవారని, రాజకీయ నిర్ణయాల్లో లాభనష్టాలను విశ్లేషించి వివరించేవారని, కానీ ఇప్పుడు ఆ విధానం పూర్తిగా తగ్గిపోయిందని చెప్పారు. రాజకీయ నాయకులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, దాని ప్రభావాన్ని ప్రభుత్వం నడిపించే అధికారులే అర్థం చేసుకోవాలని, కానీ ఇప్పుడు అలాంటి దృక్పథం తగ్గిపోయిందని అన్నారు.
వల్లభనేని వంశీ కేసు విచారణ ముమ్మరం చేసిన ఏపీ పోలీసులు..
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ కేసులో విచారణను ఏపీ పోలీసులు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న ఏడుగురు నిందితుల కోసం హైదరాబాద్, విశాఖ పట్నంకు ఏపీ పోలీస్ ప్రత్యేక బృందాలు వెళ్లాయి. నిందితులు ఉపయోగించిన రెండు కార్లు గుర్తించే పనిలో పడ్డారు పోలిసులు. అయితే, పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడానికి పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. నిందితుల ఫోన్ కాల్స్ ను క్రొడీక్రిస్తున్నారు. విజయవాడ- హైదరాబాద్, విజయవాడ- విశాఖ మార్గాల్లో టోల్ ప్లాజాలో నిందితుల యొక్క కార్ల రాకపోకలను గుర్తించడం కోసం సీసీ టీవీ ఫుటేజ్ విజువల్స్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. మరోవైపు, వల్లభనేని వంశీని కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్ పై రేపు (ఫిబ్రవరి 17) విచారణ జరగనుంది.
ఉస్మానియా ఆస్పత్రి వద్ద హృదయ విదారక ఘటన.. కన్నీళ్లు ఆగవు..
ఓ మహిళ కదల్లేని పరిస్థితిలో ఉస్మానియా ఆస్పత్రికి చేరుకుంది. ఆసుపత్రి సిబ్బంది ఆమెకు వైద్యం చేయలేదు. ఆధార్ కార్డు లేని కారణంగా.. బాధితురాలిని గెంటేశారు. ఆమె పరిస్థితి చూసి కనికరం చూపించలేదు. ఆమె వెంట తన కుమార్తె ఉంది. పొట్ట చేత పట్టుకుని పల్లె నుంచి పట్నం వచ్చిన మహిళ ఆస్పత్రి వద్ద వైద్యం అందించాలని ప్రాధేయపడింది. అయినా కనికరించలేదు. ఈ సన్నివేశాన్ని అన్ని చూస్తున్న అభం శుభం తెలియని చిన్నారి తన తల్లిని ఒడిలో పెట్టుకుని సేవ చేస్తూ కనిపించింది. ఈ దృశ్యాలను చూస్తున్న వారి కళ్లు చెమ్మగిల్లాయి. అసలేం జరుగుతుందో.. ఎవ్వరిని ఏం అడగాలో తెలియని వయసులో చిన్నారి ఉంది. ఏం చేయలేని స్థితిలో తల్లి పడుకుని ఉంది.