సీఎం కేసీఆర్ నేడు తన దత్తత గ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిలో పర్యటించనున్నారు. గత జూన్ 22న ఆ గ్రామంలో పర్యటించిన సీఎం.. 42 రోజుల తర్వాత మరోసారి గ్రామానికి విచ్చేస్తున్నారు. సీఎం పర్యటన సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 11 గంటలకు సీఎం రోడ్డు మార్గంలో వస్తున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు చేపట్టారు. పల్లెబాట కార్యక్రమంలో తొలుత సీఎం దళితవాడలో పర్యటించి, తర్వాత గ్రామమంతా కలియ తిరుగుతూ పారిశుద్ధ్య చర్యలను పరిశీలిస్తారు. ప్రజలతో మాట్లాడిన అనంతరం సర్పంచి పోగుల ఆంజనేయులు నివాసంలో భోజనం ముగించుకుని.. రైతు వేదిక భవనంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడతారు.సీఎం పర్యటన నేపథ్యంలో కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో జిల్లా ఉన్నతాధికారులంతా.. వాసాలమర్రి వసతులపై దృష్టిసారించారు.