హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. ఎప్పుడు ఎక్కడ ఎలా పడతారో తెలియడం లేదు. వరుస దొంగతనాల కేసులతో పోలీసులు సతమతమవుతున్నారు. తాజాగా..హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్‌లో దొంగలు తమ చేతివాటం చూపెట్టారు. ఏకంగా అయ్యప్ప స్వాములకే పంగ నామాలు పెట్టారు దొంగలు.
స్వాముల తెలిపిన వివరాల ప్రకారం.. హిమాయత్ సాగర్ దర్గా ఖలీజ్ ఖాన్ లో అయ్యప్పస్వామి దీక్షలో ఉన్న స్వాముల బ్యాగ్‌లో ఉన్న రూ.30 వేల నగదు, ఓ బైకును దుండగులు దొంగిలించారు. అర్ధరాత్రి స్వాములు నిద్రిస్తున్న సమయంలో పక్క రూంలో ఉన్న బ్యాగ్ నుంచి నగదు, ఇంట్లో పార్క్ చేసిన బైక్‌తో దుండగుడు పరారయ్యారని స్వాములు తెలిపారు. ఉదయం నిద్రలేచి చూసే సరికి బైక్ కనబడక పోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చామని స్వాములు తెలిపారు. బైక్ తో పాటు నగదు పోయినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న రాజేంద్ర నగర్ పోలీసులు నిందితులను త్వరలో పట్టుకుంటామని తెలిపారు.