There Is No Problem To Congress With KCR National Party Says Bhatti Vikramarka: తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టుకోవడం ద్వారా కాంగ్రెస్‌కి ఇబ్బందేమీ లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. దిగ్విజయ్ సింగ్, జైరాం రమేష్‌లతో భేటీ అయిన అనంతరం మాట్లాడిన ఆయన.. దేశంలో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చని తెలిపారు. భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీని తాను కలిశానని, జాతీయ నేతల్ని సైతం కలిసి తెలంగాణ రాజకీయాలపై చర్చించానని చెప్పారు. దేశంలో లౌకికవాద పౌరులంతా కాంగ్రెస్ వైపు వస్తున్నారని, అయితే అలా వస్తున్న వారిని ఆపేందుకు కొన్ని శక్తులు పుట్టుకొచ్చాయని, కేసీఆర్ జాతీయ పార్టీ కూడా అలాంటిదే అయ్యుండొచ్చని విమర్శించారు. ఈసారి తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. మునుగోడులో సైంటిఫిక్‌గా ఆలోచించే తాము పాల్వాయి స్రవంతికి టికెట్ ఇచ్చామన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలవడం తథ్యమని భట్టి విక్రమార్క జోస్యం చెప్పారు.
అంతకుముందు భట్టి విక్రమార్క బీజేపీ, సీఎం కేసీఆర్‌లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అంబానీ, అదానీ, ఇతర సంపన్నులు బ్యాంకుల నుంచి తీసుకున్న రూ. 12 కోట్ల లక్షల రుణాల్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించిన ఆయన.. ఇది రైతు ప్రభుత్వమా లేక కార్పొరేటర్ల ప్రభుత్వమా? అంటూ నిలదీశారు. తెలంగాణ పర్యటనకు ఆర్థికమంత్రి నిర్మాలా సీతారామన్ వచ్చినప్పుడు.. రైతు రుణమాఫీ విషయంలో చొరవ చూపి ఉంటే బాగుండేదన్నారు. కానీ, ఆమె పర్యటన కేవలం ఉపన్యాసాలకే పరిమితం కావడం విచారకరమన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, నకిలీ విత్తనాలతో పంట దిగుబడి రాక.. ప్రైవేటు అప్పులు తీర్చలేని పరిస్థితుల్లో రైతులు ఉన్నారన్నారు. వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందు సీఎం కేసీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి కలిసి.. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం నిర్వహించి ఉంటే, ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు.