గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులను మల్టీజోనల్ క్యాడర్ కేటాయింపులో భాగంగా రూపొందించిన సినియార్టీ జాబితాల్లోని లోపాలను సవరించి ఖచ్చితంగా జాబితాను రూపొందించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం డీయస్‌ఈ శ్రీదేవసేన తన కార్యాలయంలో గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సీనియారిటీ జాబితాలపై అభ్యంతరాలను తెలియజేయాలని కోరారు.
దీనిపై ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. రాత్రి 12.00గంటలకు లిస్టులు పంపి ఉదయానికి అభ్యంతరాలు చెప్పమనటం సమంజసం కాదని టీఎస్‌యూటీఎఫ్ సంఘం నాయకులు ఆరోపించారు. సీనియార్టీ జాబితాతో జాయినింగ్ తేదీ ఆధారంగా చేయటం సరైంది కాదన్నారు. స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీసు నిబంధనలు 33,34,35,36 ప్రకారం చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. దీనిపై పరిశీలించి చర్యలు తీసుకుంటామని దేవసేన తెలిపారు. ఈ సమావేశంలో టీఎస్ యూటీఎఫ్ పక్షాన రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి పాల్గొన్నారు.