సంగారెడ్డిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వివాహానికి గంట ముందు వరుడు పరారయ్యాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కంది మండలం, చిమ్నాపూర్ గ్రామానికి చెందిన యువతికి కొండాపూర్ మండలం, మల్కాపూర్‌కు చెందిన మాణిక్ రెడ్డితో ఈ నెల 12న వివాహానికి పెద్దలు నిశ్చయించారు. మరికాసేపట్లో పెళ్లి జరుగుతుందనగా గంట ముందు కట్నంగా ఇచ్చిన రూ. 25 లక్షల నగదు, 25 తులాల బంగారంతో వరుడు పరారయ్యాడు. దీంతో వివాహం ఆగిపోయింది.
వధువు తల్లిదండ్రులు పోలీసులు, న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. సంగారెడ్డి పట్టణ పరిధిలోని పోతిరెడ్డిపల్లిలోని కల్యాణమండపంలో వివాహం చేయాలని నిశ్చయించారు. పెళ్లికి అంతా సిద్ధమవుతుండగా వరుడికి కట్న కానుకలుగా ఇచ్చిన డబ్బు, బంగారంతో జంప్ అయ్యాడు.ఈ విషయం బయటికి తెలిసిన మాణిక్‌రెడ్డి కుటుంబ సభ్యులు పరువు పోయిందని భావించి ఊరు విడిచి వెళ్లిపోయారు. వధువు తరపు బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పారిపోయిన వరుడి కోసం పోలీసులు గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.