Ten Gates Of Nagarjuna Sagar Project Lifted: తెలంగాణ రాష్ట్రంలో మరోసారి వర్షాలు భారీగా కురుస్తుండడంతో.. వరద ప్రవాహంతో జలాశయాలు నిండిపోతున్నాయి. నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరుతోంది. శ్రీశైలం నుంచి భారీగా ఇన్ఫ్లో వస్తుండటంతో.. నాగార్జున సాగర్ నీటిమట్టం పూర్తిస్థాయికి చేరువైంది. ప్రస్తుతం ఈ జలాశయానికి 4,72,708 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 584.20 అడుగులకు చేరుకుంది. నీటి నిల్వ సామర్థ్యం 312.0405 టీఎంసీలు కాగా.. ప్రెజెంట్ నీటి నిల్వ 295.1270 టీఎంసీలుగా తేలింది. ఈ నేపథ్యంలోనే 10 అడుగుల మేర 10 గేట్లను ఎత్తేశారు. ఎన్ఎస్పీ సీఈ శ్రీకాంత్ రావు, ఎస్ఈ ధర్మానాయక్ నీటి విడుదలను ప్రారంభించారు. 1లక్ష 60 వేల క్యూసెక్కుల నీటి విడుదల అవుతోంది. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.
అటు.. భద్రాచలం వద్ద గోదావరి కూడా మరోసారి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. గురువారం ఉదయం 6 గంటల సమయానికి నీటిమట్టం 51.50 అడుగులకు చేరింది. ఎగువ నుంచి వరద వచ్చి చేరుతుండటంతో.. గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గోదావరిలో నీటిమట్టం 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేయనున్నారు. కొన్ని వారాల క్రితమే గోదావరి నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో.. గ్రామాలు జలమయమైన సంగతి తెలిసిందే! ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితి వస్తుండటంతో, ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.