తెలుగు అకాడమీ కేసులో కీలక విషయాలు వెలుగుచూశాయి. అకాడమీ డబ్బులు కొట్టేసిన గ్యాంగ్.. ప్రైవేటు వ్యక్తుల డిపాజిట్లు కూడా నొక్కేసినట్టు తెలిసింది. యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన ప్రైవేట్ వ్యక్తుల డబ్బులను.. నకిలీ పత్రాలు చూపి.. ఈ ముఠా స్వాహా చేసినట్టు నిర్ధారించారు . ఏపీ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ సహకారంతో.. మస్తాన్ వలీ అండ్ గ్యాంగ్ ఈ వ్యవహారం నడిపినట్టు దర్యాప్తులో తేలింది.కోట్ల రూపాయలు అడ్డంగా దోచుకున్న స్కామ్‌లో కీలక నిందితుడైన యూబీఐ బ్యాంకు మేనేజర్ మస్తాన్ వలిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో, ఈ కేసులో అరెస్టుల సంఖ్య నాలుగుకు పెరిగింది. మరో నలుగురి కోసం గాలిస్తున్నారు. ఇప్పటికే అరెస్టయిన ఏపీ మార్కెటింగ్ సొసైటీ అధ్యక్షుడు సత్యనారాయణ రావు, మేనేజర్ పద్మావతి, మరో ఉద్యోగి మొహినుద్దీన్‌లను రిమాండ్‌కు పంపించారు.
ఈ కుంభకోణంలో బ్యాంకు మేనేజర్లతో పాటు, అకాడమీకి చెందిన ఉద్యోగుల హస్తం కూడా ఉందనే ఆనుమానాల్ని వ్యక్తమవుతున్నాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్ల గోల్‌మాల్‌తో సంబంధమున్న నలుగురు ఉద్యోగులు ఇప్పటికే ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన నేపథ్యంలో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. సెప్టెంబర్ 18న అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డి బ్యాంకు అధికారులతో భేటీ అయ్యారు.
కార్వాన్ యూబీఐ బ్యాంకులో ఉన్న 24 కోట్ల రూపాయల డిపాజిట్లను విత్‌డ్రా చేయాలని నిర్ణయించారు. అందుకోసం అకాడమీ ఉద్యోగి రఫిక్‌ను బ్యాంకుకు పంపగా, రాజ్‌కుమార్ అనే వ్యక్తి ఎదురుపడ్డాడు. మస్తాన్‌వలీ మనిషిగా పరిచమైన రాజ్‌కుమార్.. ఎఫ్‌డీల విత్‌డ్రాపై కాలం వెల్లదీశాడు. మస్తాన్ వలీకూడా డిపాజిట్ల విత్‌డ్రాకు మరింత సమయం కావాలని కోరాడు. చివరకు సెప్టెంబర్ 24న మళ్లీ బ్యాంకుకు వెళ్లి ఆరాతీయగా.. అసలు విషయం బయటపడింది. దర్యాప్తులో వేగం పెరగడంతో.. ఒక్కొక్కటిగా అకాడమీలో జరిగిన అక్రమాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి.