భూమి కోసం, భుక్తి కోసం.. వెట్టి చాకిరి విముక్తి కోసం.. తెలంగాణలో సాగిన సాయుధ రైతాంగ పోరాటం ఎన్నో పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచింది.. భారత్‌కు ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్యం వస్తే.. నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ ప్రాంతం మాత్రం.. సెప్టెంబర్ 17వ తేదీన భారత్‌లో విలీనం అయ్యింది.. ఈ పరిణామం జరిగి 75 ఏళ్లు అయిన సందర్భంగా… తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల పేరుతో తెలంగాణ ప్రభుత్వం.. మూడు రోజులపాటు ఉత్సవాలను నిర్వహిస్తోంది.. ఉత్సవాల నిర్వహణలో ఎలాంటి లోటు లేకుండా చర్యలు తీసుకోవాలని, స్వయంగా పర్యవేక్షించాలని కలెక్టర్లను, ఎస్పీలను ఇప్పటికే సీఎస్ సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.. మరోవైపు.. సచివాలయం, అసెంబ్లీ సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలను, ప్రధాన కూడళ్లను విద్యుత్తు దీపాలతో అలంకరించారు.. రాత్రి అయితే చాలు.. విద్యుత్ దీపాల కాంతాల్లో ఆయా ప్రాంతాలు వెలిగిపోతున్నాయి.
Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
మూడు రోజుల పాటు జరగనున్న తెలంగాణ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా ఇవాళ సెప్టెంబర్ 16న అన్ని నియోజకవర్గాలలో ర్యాలీలు నిర్వహించనున్నారు.. ప్రతీ నియోజకవర్గంలో దాదాపు 15 వేల మందితో ర్యాలీలు నిర్వహించి తెలంగాణ సమైక్యతను ఎలుగెత్తి చాటాలని నిర్ణయించింది సర్కార్.. ర్యాలీల్లో విద్యార్థులు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనేలా ప్లాన్ చేశారు.. రెండో రోజైన శనివారం.. అదే భారత్ యూనియన్‌లో తెలంగాణ కలిసిన రోజైన సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్‌లో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం బంజారాహిల్స్‌లో నిర్మించిన కుమ్రంభీం ఆదివాసీ భవన్, సంత్ సేవాలాల్ బంజారా భవన్‌ను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్న సీఎం కేసీఆర్. ఈ బహిరంగ సభకు గిరిజన ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖలకు చెందిన అధికారులతో పాటు పెద్ద ఎత్తున ఆదివాసి, గిరిజన తెగలకు చెందిన ప్రజలు హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇక, నెక్లెస్ రోడ్ నుంచి గుస్సాడీ, గోండు, లంబాడి తదితర 30 కళారూపాల కళాకారులతో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. మరోవైపు, జిల్లా కేంద్రాల్లో మం త్రులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండాలు ఆవిష్కరించనున్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో అధికారులు, కమిషనర్లు, చైర్మన్లు, సర్పంచ్‌లు జాతీయ జెండా ఎగురవేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు.. ఈనెల 18న అన్ని జిల్లా కేంద్రాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించి, స్వాతంత్య్ర సమరయోధులు, కళాకారులను సన్మానించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మూడు రోజుల కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు..