తెలంగాణలో బోనాలు ప్రారంభం అయ్యాయి.. గోల్కొండలో ప్రారంభమైన బోనాలు.. లష్కర్ (సికింద్రాబాద్), లాల్‌దర్వాజా (ఓల్డ్‌సిటీ) బోనాలతో ముగియనున్నాయి.. ఇక, పల్లెలు, పట్నం, అంతటా బోనాలు జరుగనున్నాయి.. ఈ ఏడాది బోనాల ఉత్సవాల ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.. ఆ నిధులను బోనాలకు ముందే దేవాలయాలకు అందిస్తామని తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్ లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి తలసాని.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాలను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించింది.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు బోనాలను ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని.. బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం 15 కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసిందని వెల్లడించారు.
Read Also: Janasena Party: రోడ్ల దుస్థితిపై జనసేన డిజిటల్ క్యాంపెయిన్.. తేదీలు షురూ
ఇక, ప్రభుత్వం మంజూరు చేసిన రూ.15 కోట్లను 3500కు పైగా ప్రభుత్వ, ప్రైవేట్ దేవాలయాలకు ఆర్ధిక సహాయం పంపిణీ చేస్తామన్నారు మంత్రి తలసాని.. ఈ నెల 17న బోనాల ఉత్సవాలు నిర్వహించే సికింద్రాబాద్ పరిధిలోని ఆలయాలకు రెండు రోజులలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ ఉంటుందన్న ఆయన.. 24వ తేదీన బోనాలు నిర్వహించే హైదరాబాద్ పరిధిలోని ఆలయాలకు 18వ తేదీన చెక్కుల పంపిణీ ఉంటుందన్నారు.. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు మంత్రి తలసాని.. బోనాల ఉత్సవాల సందర్భంగా సాంస్కృతిక శాఖ కళాకారులచే ప్రతి నియోజకవర్గ పరిధిలో 4 ప్రాంతాలలో సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక, పాతబస్తీలో 25 ప్రాంతాలలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ఉండాలని.. భారీ వర్షాలు, ఈదురు గాలుల నేపధ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. మరోవైపు, భారీ వర్షాలు, ఈదురుగాలల నేపథ్యంలో ప్రస్తుతం అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.