తెలంగాణలో చార్జీల పెంపుపై కసరత్తు చేస్తున్న విద్యుత్ అధికారులు ప్రజలపై భారం పడకుండా లాభం పొందడానికి గల మార్గాలను అన్వేషిష్తున్నారు. ముఖ్యంగా చాలా కాలంగా పెంచని ప్రాథమిక చార్జీల్లో మార్పులు చేసే అవకాశం ఉంది. LT 1-A కేటగిరీలో 50 యూనిట్లలోపు విద్యుత్ వినియోగిస్తే యూనిట్‌కు రూపాయి 45 పైసలు చొప్పున వసూలు చేస్తున్నారు. మొదటి నుంచి ఈ చార్జీల్లో మార్పు లేదు. ఈ సారి స్వల్పంగా పెంచి దానిని రూపాయిన్నరగా రౌండ్ ఫిగర్ చేసే అవకాశాలున్నాయి. అంటే, యూనిట్‌కు 5 పైసలు పెంచడం వల్ల నెల బిల్లులో కేవలం 3 రూపాయలు మాత్రమే పెరుగుతుందంటున్నారు అధికారులు. ఇది వినియోగదారులకు పెద్ద భారమేమీ కాదంటున్నారు. అలాగే, స్లాబుల సరళతరంపైనా ఫోకస్ పెట్టారు.
స్లాబుల్లో మార్పు, డిమాండ్ చార్జీల పెంపుతో పరోక్ష ఆదాయం పెరగవచ్చని భావిస్తున్నాయి డిస్కమ్‌లు. ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే పారిశ్రామిక విద్యుత్ చార్జీలు తెలంగాణలో ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఏపీ చార్జీలకు సమానంగా ఉండేలా పారిశ్రామిక చార్జీలు తగ్గించే అవకాశం ఉంది. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీల మేరకు సబ్సిడీలు సకాలంలో అందజేయడం లేదు. దీనికి తోడు 9 గంటల వ్యవసాయ విద్యుత్ కాస్తా 24 గంటలకు పెరిగింది. వ్యవసాయ విద్యుత్‌కు సరైన లెక్కలు లేవు. ఇది చాలదన్నట్టు ఉద్యోగులకు పదోన్నతులు, కొత్త పోస్టుల భర్తీ కారణంగా విద్యుత్ సంస్థలపై వేతన భారం పెరిగింది. ఇప్పుడు ఈ మొత్తం భారాన్ని వినియోగదారులకు మళ్లించే పనిలో ఉంది ప్రభుత్వం. అయితే, నేరుగా చార్జీల మోపకుండా… ఆదాయం ఎలా పెంచుకోవాలనే దానిపై భారీ కసరత్తే చేస్తోంది. మరోవైపు.. విద్యుత్ చార్జీలు పెంచాలన్న ప్రతిపాదనలను ఖండిస్తున్నాయి ప్రతిపక్షాలు. జనంపై భారం మోపితే సహించబోమంటున్నాయి. గత ఏడేళ్లలో కరెంట్ ఛార్జీలు పెరగలేదు. కానీ… ఇప్పుడు చార్జీల పెంపు అనివార్యమని తెలుస్తోంది. ప్రస్తుతం డిస్కమ్స్ వేల కోట్ల నష్టాల్లో ఉన్నాయి. మరోవైపు… ప్రభుత్వం సబ్సిడీల భారం ప్రతీ సంవత్సరం పెంచుకుంటూ పోతోంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయిస్తే ఛార్జీల పెంపు ఉండదు. లేదంటే వచ్చే ఏప్రిల్ 1 నుంచి విద్యుత్ చార్జీల భారం తప్పకపోవచ్చు. అయితే, దీనిపై సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.