ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే కార్యక్రమం చేపట్టి పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తో కలిసి రాజ్ భవన్ లోని తన నివాసంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దంపతులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గవర్నర్ గారు మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరిపై ఉందని యువకుడు రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టి పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజల్లో చైతన్యం తీసుకురావడం అభినందనీయమని అన్నారు. సందర్భం ఏదైనా మొక్కలు నాటాలని పిలుపునివ్వడం ప్రజల్లో చైతన్యం తీసుకురావడం జరుగుతుందని అన్నారు. నా పుట్టినరోజు సందర్భంగా కూడా శుభాకాంక్షలు తెలియజేసి మొక్కలు నాటాలని పిలుపునివ్వడంతో ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సంతోష్ కుమార్ గారితో కలిసి మొక్కలు నాటడం జరిగింది అని తెలిపారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టి ముందుకు తీసుకుపోతున్న సంతోష్ కుమార్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఇదే విధంగా ముందుకు కొనసాగాలని వారికి తమ పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని గవర్నర్ గారు అన్నారు.