తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం.. అందులో భాగంగా.. నేతల మధ్య ఉన్న అసంతృప్తులకు చెక్ పెట్టే విధంగా కీలక సమావేశాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఢిల్లీలో మకాం వేసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు.. అయితే, రాహుల్‌తో సమావేశం కొనసాగుతుండగానే మధ్యలోనే సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు పార్టీ సీనిరయర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. అందరితో కలిసి మాట్లాడిన రాహుల్ గాంధీ.. ఒక్కొక్కరి అభిప్రాయాలు తెలుసుకునే పనిలో ఉన్నారు.. అంతా కలిసి కట్టుగా ఉండాలనే సంకేతాలు ఇచ్చారు.. అయితే, టికెట్ల ప్రకటనపై రాహుల్ తో సమావేశంలో మాట్లాడిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. భేటీ ముగియక ముందే మధ్యలోనే బయటకి వచ్చేయడం చర్చగా మారింది.
Read Also: Uttarakhand: రాహుల్ గాంధీకి తన ఆస్తి మొత్తం రాసిచ్చేసిన వృద్ధురాలు
అయితే, ఢిల్లీ యూనివర్సిటీలో తెలుగు విద్యార్థుల సమావేశం కోసం బయటకు వచ్చినట్టు ఈ సందర్భంగా వెల్లడించారు ఎంపీ కోమటిరెడ్డి.. జిల్లాల్లో పార్టీ బలోపేతం, పీసీసీ చీఫ్ వ్యవహార శైలిపై సమావేశంలో మాట్లాడినట్టు తెలిపిన ఆయన.. ఆర్నెళ్ల నుంచి ఏడాది ముందే అసెంబ్లీ అభ్యర్ధులను ఖరారు చేసి కార్యాచరణ చేపట్టాలని కోరాను.. కరీంనగర్ జిల్లాలో ఒకట్రెండు అసెంబ్లీ స్థానాలకు పీసీసీ చీఫ్ ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడాన్ని రాహుల్ దృష్టికి తీసుకెళ్లానని వెల్లడించారు.. అభ్యర్థులను ప్రకటించే ముందు ఆ జిల్లాల్లో సీనియర్లుగా ఉన్న జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబులతో చర్చించకుండా ఎలా ప్రకటిస్తారు? అని ప్రశ్నించిన ఆయన.. అభ్యర్థుల ప్రకటించేందుకు అధిష్టానం అనుమతి ఇచ్చిందా..? అని కూడా నిలదీశారు. ఇలా ముందే ప్రకటించటం వల్ల సీనియర్లపై ఒత్తిడి పెరుగుతుందని.. కాంగ్రెస్ పార్టీ సిస్టంలోనే ముందుకు పోవాలి కదా? అని ప్రశ్నించారు.. ఈ విషయాలను రాహుల్ గాంధీకి చెప్పి సమావేశం నుంచి బయటకు వచ్చినట్టు తెలిపారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.