Cold Wave’s: తెలంగాణ రాష్ట్రంపై చలి పంజా విసురుతుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లో భారీగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. పొగమంచు సైతం పెరిగింది. రాబోయే రోజుల్లో ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ లాంటి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక, మంగళవారం ఉదయం 13 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు ఉండే ఛాన్స్ ఉందన్నారు. ఇప్పటికే ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసేశారు. పలు జిల్లాల్లో గత ఏడాదితో పోలిస్తే 2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గిపోయినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ శివారులోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే 14 నుంచి 15 డిగ్రీల మధ్య రాత్రి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
Read Also: AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక ప్రతిపాదనలపై ఫోకస్..
కాగా, ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉదయం, రాత్రి వేళల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని, వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు, అనారోగ్యంతో ఉన్న వారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. అవసరమైతే మాత్రమే ఇళ్ల నుంచి బయటకు రావాలని, బయటకు వెళ్లేపుడు వెచ్చని బట్టలు, మప్లర్లు, తలపాగలు ఉపయోగించాలని పేర్కొన్నారు. పల్లెల్లో, పట్టణాల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా మంటలు వేసుకునే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, గ్యాస్ హిటర్లు, కట్టెల మంటలు వాడేటప్పుడు పిల్లలను దూరంగా ఉంచాలని కలెక్టర్ తెలిపారు. రాబోయే రోజుల్లో వాతావరణ మార్పులు, చలి తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉన్నందున ప్రజల అప్రమత్తంగా ఉండాలని వెల్లడించారు. అయితే, జిల్లాలోని భీంపూర్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ) మండలాల్లో అత్యల్పంగా 14.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.