తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు మల్లన్నసాగర్‌ను సీఎం కేసీఆర్ బుధవారం నాడు జాతికి అంకితం చేశారు. సిద్ధిపేట జిల్లాలో మల్లన్నసాగర్ ప్రాజెక్టును ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ… తెలంగాణకు కరవు రాకుండా చేసే ప్రాజెక్టే కాళేశ్వరం అని పేర్కొన్నారు. దేశమంతా కరవు వచ్చినా ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు మాత్రం రాదని కేసీఆర్ అన్నారు. మల్లన్నసాగర్ ప్రారంభంతో కాళేశ్వరం కల సాకారమైందన్నారు. ఈ ప్రాజెక్టు ఆపేందుకు చాలా మంది ఎన్నో కేసులు వేశారని.. అయినా తాము వెనక్కి తగ్గలేదని తెలిపారు. దాదాపు 600కు పైగా కేసులు వేశారంటే ఎంతగా ఈ ప్రాజెక్టును అడ్డుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఆ సమయంలో తాను ఢిల్లీలో ఉన్నానని.. అక్కడి నుంచే హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు కాల్ చేసి ఉన్నతంగా ఆలోచించి ఈ ప్రాజెక్టును కాపాడాలని కోరినట్లు గుర్తుచేశారు.
అటు మల్లన్నసాగర్ నిర్వాసితులకు పరిహారం అందేలా తక్షణ చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఒకవిధంగా చెప్పాలంటే మల్లన్నసాగర్.. తెలంగాణ జనహృదయ సాగరమని కేసీఆర్ అభివర్ణించారు. గోదావరి నీళ్లు తెచ్చి కొమురవెల్లి మల్లన్న పాదాలు కడుగుతామని గతంలో చెప్పామని.. తాము చెప్పిన విధంగా గోదావరి జలాలతో మల్లన్నకు అభిషేకం చేయబోతున్నట్లు కేసీఆర్ తెలిపారు. మరోవైపు తాను జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే దిశగా ముందుకు సాగుతున్నానని సీఎం కేసీఆర్ అన్నారు. వందకు వందశాతం తన మేధో సంపత్తిని ఉపయోగించి చివరి రక్తపు బొట్టు ధారబోసైనా సరే దేశాన్ని గాడిలో పెడతానని స్పష్టం చేశారు. ప్రశాంతమైన పాలనతోనే తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రజల మధ్య కుల, మత విద్వేషాలు దేశానికి మంచివి కావని, వాటిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.