పోలీస్ ఉద్యోగాలే టార్గెట్ గా కష్టపడుతున్న వారికి, తమకు వయో పరిమితి దాటిందని బాధపడుతున్ననిరుద్యోగులకు శుభవార్త చెప్పింది తెలంగాణ సర్కార్. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పోలీస్ రిక్రూట్మెంట్ కు సంబంధించిన నోటిఫికేషన్ రావడంతో నిరుద్యోగుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. ఇటీవల తెలంగాణ సర్కార్ 17,291 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకు తగ్గట్లుగానే లక్షల్లో దరఖాస్తులు వస్తున్నాయి. ఇప్పటి వరకు దాదాపుగా 10 లక్షల దరఖాస్తులు వచ్చాయి.
ఇదిలా ఉంటే కోవిడ్ వల్ల, నోటిఫికేషన్ ఆలస్యం అవ్వడం అభ్యర్థుల వయోపరిమితిని పెంచాలని ఇటు ప్రతిపక్షాలతో పాటు నిరుద్యోగులు కూడా ప్రభుత్వాన్ని కోరాయి. ఇదే విషయాన్ని తాజాగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రావు సీఎం కేసీఆర్ కు విన్నవించారు.. దీనికి సానుకూలంగా స్పందించిన కేసీఆర్ రెండేళ్లు వయోపరిమితిని పెంచేందుకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ప్రభుత్వం కానిస్టేబుల్ పోస్టులకు మూడేళ్లు వయోపరిమితిని పెంచింది. తాజా నిర్ణయం వల్ల మరో రెండేళ్లు వయోపరిమితి పెరిగింది. దీంతో ఇన్నాళ్లు వయోపరిమితి అడ్డంకి అనుకున్న అభ్యర్థులంతా ఈ నిర్ణయంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వ నిర్ణయం వల్ల ఎస్ఐ ఉద్యోగానికి 30 ఏళ్లు ఉన్నావారు, కానిస్టేబుల్ ఉద్యోగానికి 27 ఏళ్లు ( జనరల్ కేటగిరి) ఉన్నవాళ్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇదిలా ఉంటే తాజాగా దరఖాస్తు గడువును కూడా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వయోపరిమితి పెంచడంతో మరింత మంది దరఖాస్తు చేసే అవకాశం ఉండటంతో దరఖాస్తు తేదీని కూడా పెంచినట్లు తెలుస్తోంది. నిజానికి ఇవాళ్టితో గడువు మగిసింది. అయితే టీఎస్ఎల్పీఆర్బీ సైట్ పనిచేయడం లేదని పిర్యాదులు అందాయి. దీంతో మే 26 వరకు దరఖాస్తు తేదీని పెంచింది ప్రభుత్వం. ఆరు నోటిఫికేషన్ల ద్వారా పోలీసు, ఫైర్, జైళ్ల శాఖ, ప్రత్యేక భద్రతా దళం, రవాణా, ఆబ్కారీ శాఖలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో 15,644 కానిస్టేబుల్ పోస్టులు కాగా 554 ఎస్సై పోస్టులు, 614 ఎక్సైజ్ కానిస్టేబుల్, 383 కమ్యూనికేషన్ కానిస్టేబుల్, 63 రవాణా కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. వీటన్నింటిని వచ్చే ఏడాది మార్చి కల్లా భర్తీ చేయాలని భావిస్తున్నారు.