IND Vs AUS: ఆదివారం నాడు హైదరాబాద్‌లో కీలక మ్యాచ్ జరగనుంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా చివరి టీ20 కోసం భారత్, ఆస్ట్రేలియా జట్లు శనివారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నాయి. ఈ సందర్భంగా తమ అభిమాన క్రికెటర్లను చూసేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. వీరిని అదుపు చేయడం పోలీసులకు కష్టమైంది. అయినా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. శంషాబాద్ చేరుకున్న అనంతరం టీమిండియా, ఆస్ట్రేలియా టీమ్‌ల సభ్యులు ప్రత్యేక బస్సులో హోటల్ తాజ్‌కృష్ణాకు వెళ్లారు. ముందు సీటులో హార్దిక్ పాండ్యా కూర్చోవడంతో అభిమానులు అతడిని చూసి హంగామా చేశారు. ఈ రోజు రాత్రికి తాజ్కృష్ణాలోనే ఆటగాళ్లు బస చేయనున్నారు.
Read Also:Team India: ఉప్పల్‌లో గెలిస్తే చరిత్ర సృష్టించనున్న టీమిండియా
కాగా రేపు జరిగే టీ20లో ఎవరు గెలిస్తే వాళ్లే సిరీస్ కైవసం చేసుకుంటారు. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అటు ఈ మ్యాచ్‌కు వచ్చే అభిమానులు కెమెరాలు, సెల్ఫీ స్టిక్‌లు, సిగరెట్లు, అగ్గిపెట్టెలు, మారణాయుధాలు, పదునైన వస్తువులు, ఆల్కహాల్, తినుబండారాలు, వాటర్ బాటిళ్లు, హెల్మెట్లు తీసుకురావొద్దని.. వాటిని స్టేడియంలోకి అనుమతించే ప్రసక్తే లేదని పోలీసులు స్పష్టం చేశారు. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం సాయంత్రం 4 గంటల నుంచి స్టేడియంలోకి అభిమానులను అనుమతిస్తామని పోలీసులు వెల్లడించారు. టిక్కెట్లు ఉన్న ప్రేక్షకులు మాత్రమే స్టేడియం వద్దకు రావాలని హితవు పలికారు.