Talasani Srinivas Yadav Controversial Comments On Rajagopal Reddy: బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సానుభూతి డ్రామాలను నమ్మొద్దని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మునుగోడు ప్రజల్ని కోరారు. గతంలో దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో బీజేపీ నేతలు కావాలనే దాడులు చేయించుకున్నారని.. ఇప్పుడు మునుగోడులో కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ని తిడుతున్నారే తప్ప.. మునుగోడు నియోజకవర్గానికి బీజేపీ ఏం చేసిందో ఆ పార్టీ నేతలు చెప్పడం లేదని విమర్శించారు. దుబ్బాక, హుజూరాబాద్ అభివృద్ధి కోసం బీజేపీ నేతలు కేంద్రం నుంచి కనీసం రూ. 1 కోటి అయినా తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు. మిషన్ భగీరథతో సీఎం కేసీఆర్ మునుగోడులో ఫ్లోరోసిస్ లేకుండా చేశారని తెలిపారు.
అంతకుముందు.. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఉప్పరిగూడ, ముదిరాజ్‌కాలనీలో ఇంటింట ప్రచారం నిర్వహించిన తలసాని.. మునుగోడు నియోజకవర్గలోని ప్రజా సమస్యలు టీఆర్ఎస్‌తోనే పరిష్కారం అవుతాయన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని మునుగోడు ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. మూడేన్నరేళ్లు ఆయన గ్రామాల వైపు చూడలేదని ఆరోపణలు చేశారు. అయితే.. సబ్బండ వర్గాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతోందని అన్నారు. బీజేపీ నేతల మాటల్ని నమ్మి మరోసారి మోసపోవద్దని విజ్ఞప్తి చేసిన ఆయన.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కులవృత్తులకు కేసీఆర్ ప్రభుత్వం చేయూతనందిస్తోందని చెప్పారు. మునుగోడు నియోజకవర్గం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే.. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని తలసాని కోరారు.