తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వివిధ కమిటీల నియమాకంపై అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.. ప్రచారాలు జోరుగా సాగుతున్నా.. రేపో, మాపో అంటూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి ఎంపిక వ్యవహారం ఊరిస్తూనే ఉంది.. తాజా పరిణామాలు చూస్తుంటే.. లిస్ట్ ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది.. తెలంగాణలో కాంగ్రెస్ బాధ్యుల నియామకానికి అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సునీతా మోగ్లి ముదిరాజ్‌ను నియమించింది అధిష్టానం.. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు మహిళా కాంగ్రెస్ అధ్యక్షరాలిగా నేరెళ్ల శారద పార్టీకి అందించిన సేవలను అభినందించింది ఏఐసీసీ.. త్వరలోనే మరికొన్ని కమిటీల పేర్లు కూడా ప్రకటించే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తోంది.