Weather: తెలంగాణ మీదుగా ఉత్తర కర్ణాటక వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో బుధవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ద్రోణి కారణంగా నగరంలో పలుచోట్ల చిరు జల్లులు కురిశాయి. సాయంత్రం 6 గంటల వరకు అందిన సమాచారం మేరకు జీడిమెట్లలో 1.5, అల్వాల్‌లో 6.3, పాశమైలారంలో 6.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు టీఎస్‌డీపీఎస్ అధికారులు వెల్లడించారు. ద్రోణి ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా అల్పపీడనంగా వీస్తున్న గాలుల ప్రభావంతో ఎండలు పెరిగి ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 28.7 డిగ్రీలు, గాలిలో తేమ 43 శాతంగా నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Read also: Dam Blast: కఖోవ్కా డ్యామ్ పేల్చివేత.. వరద నీటిలో ఖేర్సన్ నగరం
ఇవాళ ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు వడగళ్ల వాన హెచ్చరికలు జారీ చేశారు. రేపు 9వ తేదీన ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పలుచోట్ల వడగళ్ల వాన కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 10వ తేదీన వరంగల్, మహబూబాబాద్, హనుమకొండ, సూర్యాపేట, నల్గొండ, ఆదిలాబాద్, ఖమ్మం, పెద్దపల్లి, నిర్మల్, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాలలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో వడగళ్ల వాన కురుస్తుందని తెలిపారు. నిన్న రాష్ట్రంలో అత్యధికంగా భద్రాచలం, ఖమ్మంలో 43 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. పటాన్‌చెర్వులో అత్యల్పంగా 22.6 డిగ్రీలు నమోదైంది. దాదాపు అన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు పైగా, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీలకు మించి నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.
Top Headlines @9AM : టాప్ న్యూస్