గ్రేటర్ హైదరాబాద్‌లో లాక్‌డౌన్ అమలు జరుగుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో కమిషనరేట్ పరిధిలో ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. కమిషనరేట్ పరిధులు దాటాలంటే తప్పనిసరిగా పాసులు ఉండాలని పోలీసులు స్ఫష్టంచేస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో పాసులు లేని వారిని కమిషనరేట్ సరిహద్దులు దాటనివ్వడం లేదు. రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ ఏ కమిషనరేట్‌లో లిమిట్ దాటాలన్నా పాసులు ఉండాలని, అత్యవసర సర్వీసులు, ఎసెన్సియల్ సర్వీసుల వారికి మాత్రమే పాసులు లేకుండా అనుమతులు ఉంటాయని పోలీసులు స్ఫష్టం చేస్తున్నారు. ఇకపోతే, ఈ కామర్స్ వారికి షరతులతో కూడిన అనుమతులు ఉన్నాయని, కోవిడ్ రోగులకు ఆహారం, మందుల సరఫరాకు అనుమతులు ఉన్నాయని డీజీపీ పేర్కొన్నారు. జోమాటో, స్విగ్గీ కంపెనీలు పోలీసులకు సహకరించాలని డీజీపీ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలుకు ఆటంకం లేకుండా చూస్తున్నామని తెలిపారు. రైతు వ్యవసాయ పనులకు ఎక్కడా ఆటంకం లేదని, చిన్న పట్టణాల నుంచి హైదరాబాద్ వరకు లాక్‌డౌన్ సమర్ధవంతంగా కొనసాగుతుందని అన్నారు. అనవసరంగా రోడ్లమీదకు రావొద్దని, ఇతర రాష్ట్రల నుంచి వచ్చేవారికి ఈపాసు తప్పనిసరి అని డీజీపీ తెలిపారు. ఈ పాసు ఎక్కడ తీసుకున్నా అనుమతిస్తామని డీజీపీ తెలియజేశారు.