హైదరాబాద్‌లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో జరిగిన ఓ దారుణ ఘటన సామాన్యులను కలవరపెడుతోంది. సంతానం కోసం ఆశతో వచ్చిన దంపతులను మోసం చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతతో పాటు ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లను గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి నిన్న మధ్యాహ్నం నుంచి పోలీసులు, రెవెన్యూ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సంయుక్తంగా సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో తనిఖీలు నిర్వహించారు.
Also Read:Posani: ‘ఆపరేషన్ అరుణా రెడ్డి’ కోసం మెగాఫోన్ పడుతున్న పోసాని
సంతానం కోసం వచ్చిన ఓ మహిళ తన భర్త వీర్య కణాలను ఉపయోగించి ఐవీఎఫ్ (IVF) ప్రక్రియ ద్వారా సంతానం కలిగించాలని కోరగా, సెంటర్ నిర్వాహకులు మరో వ్యక్తి వీర్య కణాలను ఉపయోగించి సంతానం కలిగేలా చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ ప్రక్రియలో జన్మించిన శిశువుకు క్యాన్సర్ సోకినట్లు నిర్ధారణ కావడంతో దంపతులకు అనుమానం కలిగింది. DNA పరీక్షలు నిర్వహించగా, శిశువు DNA భర్త యొక్క DNAతో సరిపోలలేదని తేలడంతో సృష్టి సెంటర్ మోసం బయటపడింది. ఈ ఘటనపై దంపతులు గోపాలపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.
Also Read:Hyderabad Thief: తస్మాత్ జాగ్రత్త.. మీ తాళంతోనే దర్జాగా మీ ఇంటిని దోచేస్తారు!
నిన్న మధ్యాహ్నం నుంచి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో తనిఖీలు చేపట్టిన పోలీసులు, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ల్యాబ్‌లో ఉన్న పలు టెస్ట్ కిట్ శాంపిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా సెంటర్ నిర్వహిస్తున్న డాక్టర్ నమ్రతతో పాటు ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లను అదుపులోకి తీసుకుని గోపాలపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌కు హైదరాబాద్‌లోని సికింద్రాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నంలో కూడా బ్రాంచ్‌లు ఉన్నాయి. ఈ సెంటర్‌లలో కూడా పోలీసులు తనిఖీలు నిర్వహించగా, సరోగసీ కోసం పెద్ద ఎత్తున వీర్య కణాలను నిల్వ చేసినట్లు, అక్రమ పద్ధతుల ద్వారా వీర్య సేకరణ జరిగినట్లు గుర్తించారు. ఈ కేసులో మొత్తం ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, మరిన్ని వివరాలు త్వరలో వెలుగులోకి వస్తాయని అధికారులు తెలిపారు.