Srinivas Goud On Telangana Development After Receiving National Awards: పర్యాటక రంగంలో దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా నిలవడంతో పాటు నాలుగు జాతీయ పురస్కారాల్ని తెలంగాణ రాష్ట్రం కైవసం చేసుకున్న నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు పరిపాలన చేత కాదని, కరెండ్ ఉండదని, మళ్లీ ఏపీనే కోరుకుంటారని హేళన చేశారని.. ఇప్పుడు అదే తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. ఉద్యమ నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక.. తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించిందన్నారు. అప్పట్లో తెలంగాణలో తాగునీరు, కరెంట్ లేకపోవడంతో వలసలు వెళ్లేవారని.. రాష్ట్రంలో 10 జిల్లాల్లో 9 జిల్లాల్ని కరువు జిల్లాలుగా కూడా ప్రకటించారని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు ప్రగతి పథంలో దూసుకుపోతోందన్నారు. దేశ అభివృద్ధిలో, జిడిపి పెంపులో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
కరోనా సహా అనేక రకాల వ్యాధులకు సంబంధించిన మందులన్నీ తెలంగాణ నుంచే వెళ్తున్నాయని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దేశంలో 24 గంటల కరెంట్, ఇంటింటికి మంచినీళ్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. సన్సద్ ఆదర్శ యోజనలో 19, స్వచ్ఛ భారత్ అవార్డుల్లో 13 అవార్డులు తెలంగాణను వరించాయన్నారు. కామన్ వెల్త్ క్రీడల్లో తెలంగాణకు రెండో స్థానం వచ్చిందన్నారు. ఈరోజు బెస్ట్ టూరిజం అవార్డుల్లో తెలంగాణకు మూడో స్థానం వచ్చిందని.. తెలంగాణకు నాలుగు అవార్డులు వచ్చాయని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధిని ఎవరు అడ్డుకోలేరన్న ఆయన.. సీఎం కేసీఆర్ పరిపాలనతో దేశానికి మంచి పేరు వచ్చిందా, లేదా? అన్నది ప్రధాని నరేంద్ర మోడీ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవేళ దేశానికి మంచి పేరు రాకపోతే.. ఇన్ని అవార్డులు ఎలా వస్తున్నాయో ఆలోచించుకోవాలని అన్నారు. దేశానికి పేరు తెస్తున్న రాష్ట్రానికి ఏం సహాయం చేస్తున్నారో కూడా ఆలోచించాలన్నారు.
ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వలేదని.. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సబబు కాదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హితవు పలికారు. కేంద్రం ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా.. రాష్ట్రం అభివృద్ధి చెందుతోందన్నారు. తెలంగాణలో అమలయ్యే కొన్ని కార్యక్రమాలు.. ఇతర రాష్ట్రాల్లో అమలు చేయాలని జనాలు కోరుకుంటున్నారన్నారు. తెలంగాణ ఎలా అవార్డులు సాధిస్తుందో… ప్రపంచంలో భారత్ కూడా అలాగే అవార్డులు సాధించాలని ఆకాంక్షించారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు, అభివృధ్ది చేస్తున్న ముఖ్యమంత్రులకు ప్రోత్సహం కల్పించాలన్నారు. అధికారం శాశ్వతం కాదని.. అధికారంలో ఉన్నప్పుడే ప్రజలకు ఉపయోగపడే మంచి పనులు చేయాలని సూచించారు. నిజాయితీగా పనిచేశాం కాబట్టే.. కేంద్ర అధికారులు కూడా తమ అభివృద్ధిని పక్కకు నెట్టలేకపోతున్నారని ప్రధాని మోడీని ఉద్దేశించి అన్నారు. ఈ సందర్భంగా పాలమూరు-రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరారు.