తెలంగాణలో సంచలనం కలిగించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో విచారణ వేగవంతంగా సాగుతోంది. ఏడుగురు నిందితులను నాలుగు రోజుల పాటు కస్టడీకి అనుమతించింది మేడ్చల్ కోర్టు. మరికొద్ది సేపట్లో నిందితులను కస్టడీకి తీసుకొని విచారణ చేయనున్నారు పేట్ బషీరాబాద్ పోలీసులు. హత్య కుట్ర ఏ విధంగా ప్లాన్ చేశారు అనేదానిపై లోతైన దర్యాప్తు జరపనున్నారు. ఎనిమిది మంది నిందితులతో పాటు మిగిలిన వ్యక్తుల ప్రమేయం పై విచారణ సాగనుంది.
ఇప్పటికే మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పీఏ జితేంద్ర రాజుకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఈ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు జితేంద్ర రాజు. శుక్రవారం వరకు స్టే ఇచ్చింది కోర్టు. పోలీసుల ముందు హాజరు కాకుండా శుక్రవారం వరకు స్టే విధించింది. సీఆర్పీసీ 160 కింద జితేందర్ రెడ్డి పిఏ కి నోటీసులు ఇవ్వగా వీటిని సవాల్ చేస్తూ కోర్ట్ కి వెళ్ళారు జితేందర్ రెడ్డి పీఏ. ఆయనకు అనుకూలంగా స్టే మంజూరు చేసింది.
ఇప్పటికే మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి డ్రైవర్ థాపా కు బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. నేటి నుండి నాలుగు రోజుల పాటు విచారణ చేయనున్నారు పోలీసులు. నిందితులను కస్టడికి ముందు, కస్టడీ ముగిసిన తరువాత వైద్య పరీక్షలు చేయించాలని, కస్టడీ విచారణ మొత్తం వీడియో గ్రఫీ చేయాలని కోర్టు ఆదేశించింది. వీడియో రికార్డింగ్ మొత్తం కోర్ట్ కి సమర్పించాలి. నిందితుల విచారణ న్యాయవాదుల ముందు విచారణ జరపాలి. ఈ కేసులో పోలీసులు సీజ్ చేసిన ఆయుధాలు, ప్రాపర్టీని కోర్టుకి సమర్పించాలి. కస్టడీలోకి తీసుకున్న తరువాత నిందితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించకూడదని కోర్టు తెలిపింది.