రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు. ఇప్పుడు ఆయన మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ నేతలు డప్పు కొడుతున్నట్టు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ తల్లి కాదని, దేశ ద్రోహి అని విమర్శించారు. అసలు కాంగ్రెస్ పార్టీనే దేశద్రోహి పార్టీ అంటూ బాంబ్ పేల్చారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా రావన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు రావాలని సూచించిన ఆయన.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 48 ఎంపీ స్థానాలకు పరిమితమైందని, రాబోయే రోజుల్లో ఆ సంఖ్య 30 లేదా 20కి చేరుతుందని జోస్యం చెప్పారు.
దేశంలో ఉన్న పార్టీలన్నీ అవినీతి పార్టీలేనని ఆరోపించిన కేఏ పాల్.. పార్టీల కంటే మనకు దేశమే ముఖ్యమన్నారు. జాతీయ రైతు నాయకుడు రాకేశ్ టికాయత్‌పై జరిగిన దాడిని ఖండించిన ఆయన.. ప్రజాస్వామ్యంలో దాడులు చేయడం సరికాదని, మాటల ద్వారా దాడి చేయడం కూడా తప్పేనని హితవు పలికారు. అయితే.. హైదరాబాద్‌లో రెడ్డి సింహగర్జన బహిరంగ సభలో మంత్రి మల్లారెడ్డిపై జరిగిన దాడి మాత్రం ‘రెడ్డి వర్గానికి సంబంధించింది’ అంటూ మరో అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్బంగా పుచ్చలపల్లి సుందరయ్య తన పేరు నుంచి రెడ్డిని తొలగించుకున్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. కుల, మతాలను ఉపయోగించుకుని రాజకీయ పార్టీలు ప్రజలను రెచ్చగొడుతున్నాయని.. భారతదేశాన్ని నంబర్ వన్ చేయాలన్నదే తన తపన అని కేఏ పాల్ వెల్లడించారు.