ఈ రోజు ఉదయం విసిరిన రాజీనామా సవాల్ స్వీకరించకుండా 2 గంటలకే బీజేపీ నేతలు దీక్షశిబిరం వదిలిపోయిన నేపథ్యంలో ఈ సాయంత్రం వనపర్తి జిల్లా కేంద్రంలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడారు. 2022కు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాననిమోడీ అన్నారని దానికి తీసుకున్న చర్యలేవో బీజేపీ నేతలు చెప్పాలన్నారు.
11 గంటల నుంచి 2 గంటల వరకు చేసేదాన్ని దీక్ష అంటారా ? అని మంత్రి ప్రశ్నించారు. రైతులపై బీజేపీకి ఉన్న చిత్తశుద్ధి ఏంటో మరోసారి రుజువైందని అన్నారు. 2 గంటలకే దీక్ష వదిలేసి పారిపోయిన మీరు రేపటి నుంచి తెలంగాణ మొత్తం దీక్షలు ఎలా చేస్తారు. అసలు దీక్షలు ఎందుకు చేస్తారని మంత్రి బీజేపీ నేతలను ప్రశ్నించారు.
రైతుబంధు ఇస్తున్నందుకు దీక్ష చేస్తారా ? రైతుభీమా ఇస్తున్నందుకు దీక్ష చేస్తరా? గుజరాత్ లో కూడా ఇవ్వని విధంగా వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరెంటు ఇస్తున్నందుకు దీక్షలు చేస్తారో చెప్పాలన్నారు. దొడ్డు వడ్లు కొనమని కేంద్రం తెలంగాణకు రాసిన లేఖ చూయించినా బండి సంజయ్ మళ్లీ అడగడం విడ్డూరంగా ఉందన్నారు. ఇంగ్లీషు తెలియకుంటే తెలిసిన వారిని అడిగి తెలుసుకోవాలని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
పంజాబ్‌లో వరి ధాన్యం సేకరించిన విధంగా కేంద్రం తెలంగాణలో వరి ధాన్యం ఎందుకు సేకరించలేదు. అక్కడ ఎంత పెట్టుబడి, కష్టం ఉంటుందో ఇక్కడా అంతే కష్టం ఉంటుంది .. కానీ అత్యధిక ఉత్పత్తి సాధిస్తున్న తెలంగాణ రైతాంగాన్ని ఎందుకు ప్రోత్సహించరు ? అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. యూపీలో రైతుల పంటలు కొనడం లేదని తగులబెట్టుకుంటున్నారని ఆ పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ స్వయంగా ట్వీట్ చేశారు. నల్లచట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై బీజేపీ మంత్రి కొడుకు వాహనం ఎక్కించి చంపేశాడు. మీకు చేతనైతే నల్లచట్టాలకు వ్యతిరేకంగా, కరెంటు చట్టాలకు వ్యతిరేకంగా దీక్షలు చేసి రద్దు చేయించాలని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.